కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట కాపుపల్లెలో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి అధ్యక్షతన మంగంపేట నిర్వాసితుల సమస్యలపై గ్రామసభ నిర్వహించారు. ఏపీఎండీసీ మైనింగ్ పక్కనే ఉన్న డేంజర్ జోన్‌లోని హరిజనవాడ, అరుంధతివాడ, కాపుపల్లి గ్రామాల ప్రజలతో మాట్లాడారు. పునరావాసం, పునర్ ఉపాధి కల్పన చట్టం 2013, 2018 అనుసరించి రెండు ప్యాకేజీలు ప్రకటించారు.
1. డేంజర్ జోన్ పరిధిలో ఉన్న కుటుంబం ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడాలనుకునే వారికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడం.
2. ప్రభుత్వం కల్పించిన ఐదు సెంట్ల స్థలంలో ఇల్లు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు చేసి కుటుంబానికి 4 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం.
నవంబర్ 12వ తేదీలోగా డేంజర్ జోన్ గ్రామాల పరిధిలో ఉన్న ప్రజల వినతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని అధికారులను ప్రభుత్వ విప్ కోరారు. స్థానిక గ్రామాల ప్రజలు ఏపీఎండీసీ ఉన్నతికి తమ భూములు ఇచ్చామన్నారు. తమ గ్రామాల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్... సమస్యలన్నీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కేతన్ గార్గ్, ఏపీఎండీసీ అధికారులు, మండల అధికారులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, పలువురు పాల్గొన్నారు.