రాష్ట్ర ప్రభుత్వం 2021- 22 ఏడాదికి సంబంధించి కడప జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి రూ.283 కోట్ల లక్ష్యాన్ని కేటాయించింది. ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు లక్ష్యాన్ని కేటాయించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది కూడా రవాణాశాఖ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిబంధనల ప్రకారం ఏప్రిల్ నుంచి మార్చి 31 వరకు కేటాయిస్తారు. కానీ కరోనా నేపథ్యంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కాస్త ఆలస్యమైంది. కేటాయించిన లక్ష్యాన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలి.
ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయట పడుతున్న సమయంలో జిల్లా రవాణా శాఖకు భారీ లక్ష్యాన్ని కేటాయించడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. లక్ష్యంలో భాగంగా మూడు నెలల పన్ను రూ. 63. 72 కోట్లు, జీవిత పన్ను రూ.157.07 కోట్లు, ఫీజులు రూ.34.71 కోట్లు, దాడుల రూపంలో రూ.18.12 కోట్లు, యూజర్ ఛార్జీల రూపంలో రూ.10.30 కోట్లను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఆరు రవాణా శాఖ కార్యాలయ పరిధిలో ఈ లక్ష్యాన్ని సాధించాలి.