కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ బడిని 1958లో స్థాపించారు. విశాలమైన ఆటస్థలం, తరగతి గదులతోపాటు... నిపుణులైన ఉపాధ్యాయ బృందం... అక్కడి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి.
2015 వరకు ఈ పాఠశాలలో అంతంత మాత్రంగానే ఫలితాలు వచ్చాయి. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన వేణుగోపాలస్వామి, సిబ్బందితో కలిసి... పాఠశాల తీరును మార్చారు. ముందుగా పాఠశాలను సుందరీకరించారు. జాతీయ నేతల చిత్రపటాలు, సైన్స్ పరికరాలు, ప్రపంచ పటాలను గొడలపై చిత్రీకరింపజేసి... విద్యార్థుల్లో ఉత్తేజాన్ని కలిగించారు. ప్రయోగశాలలు, గ్రంథాలయం, వీడియో పాఠాలు అందుబాటులోకి తెచ్చారు.
ప్రత్యేక స్టడీ అవర్స్‌తో విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దారు. ఫలితంగా... చదువుతోపాటు, క్రీడల్లోనూ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ ప్రదర్శించారు. ట్రిపుల్ ఐటీలో జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించి గుర్తింపు పొందారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.