Government No Steps on Kadapa Steel Plant: 2019 డిసెంబరు 23న ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా కన్యతీర్థం బహిరంగ సభలో మూడేళ్లలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేస్తానని సీఎం జగన్ చెప్పారు. ముఖ్యమంత్రి అయిన ఆర్నెళ్లకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారని సీఎం సెలవిచ్చారు. మరీ ఈ ఉక్కు ఫ్యాక్టరీ కల సాకారం చేయడంలో మీ చిత్తశుద్ధి టెంకాయ కొట్టడం వరకేనా? ఫ్యాక్టరీని వాస్తవ రూపంలోకి తేవడం కాదా? సొంత జిల్లా ప్రజలను ఇలా మోసం చేసిన మీరు రాష్ట్ర ప్రజలకు ఎలా మేలు చేస్తారు?
జన్మనిచ్చిన జమ్మలమడుగుకు ‘సున్నం’ పెట్టడమేనా రుణం తీర్చుకోవడమంటే..? ముఖ్యమంత్రి హోదాలో ఆర్నెళ్లకు ఒకసారి, మూడేళ్లకు మరోసారి టెంకాయ కొట్టడమేనా మీ చిత్తశుద్ధి అంటే..? ‘ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ స్టీల్‌ప్లాంట్ రావాలని నాన్న కలలు కన్నారు.. వాటిని మీ బిడ్డగా పరిశ్రమలు తెస్తున్నా’ అంటూ మీరు చెప్పిన మాటలు నీటి మూటలేనా సీఎం గారూ..! కడప ఉక్కు ఫ్యాక్టరీ కల ఇంకెన్నాళ్లకు.. ఇంకెన్నేళ్లకు సాకారం అవుతుందో.. అసలు అవుతుందా..?
కడప ఉక్కుకు నాలుగోసారి శంకుస్థాపన.. మూడేళ్ల తర్వాత అదే స్థలంలోనే..
కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా నాటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 9 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప. అందులోనూ కడప లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆయన సోదరుడు అవినాష్‌రెడ్డే. పార్లమెంటులో ఎంపీల సంఖ్యాబలం పరంగా నాలుగో అతిపెద్ద పార్టీ అధినేతగా, సీఎం జగన్ తన సొంత జిల్లాకు కేంద్రం ఇచ్చిన హామీని ఎందుకు సాధించలేకపోతున్నారు?
రెండోసారి జగన్ శంకుస్థాపన:పరిశ్రమలను మూడేళ్లకు పూర్తి చేస్తామని చెప్పిన మూడు సంవత్సరాల మూడు నెలలకు జగన్ మళ్లీ వచ్చారు.. అయితే వచ్చింది పరిశ్రమను ప్రారంభించేందుకు కాదు.. మళ్లీ శంకుస్థాపనకే.. 2023 ఫిబ్రవరి 15న సున్నపురాళ్లపల్లెలో ఉక్కు పరిశ్రమకు రెండోసారి జగన్ భూమి పూజ చేశారు. 700 కోట్లతో మౌలిక వసతులను కల్పిస్తామన్న ముఖ్యమంత్రి ప్రగల్భాలకు.. వాస్తవ కేటాయింపులకు అసలు పొంతనే లేదు. ఇప్పటివరకూ కేటాయించింది కేవలం 250 కోట్లు. ఇందులో పనులు చేసింది 50 కోట్ల మేరకే అని సంబంధిత శాఖ అధికారులే చెబుతున్నారు. అలాగే ‘ప్రొద్దుటూరు-ఎర్రగుంట్ల రైల్వేలైన్ కోసం కొత్తగా 10 కిలోమీటర్ల లైన్ నిర్మాణం కూడా జరుగుతుంది’ అని మీరే స్వయంగా ప్రకటించారు కదా ముఖ్యమంత్రి గారూ..? ఇప్పటివరకూ కనీసం ప్రతిపాదన దశ కూడా పూర్తి కాలేదెందుకు?
కడప స్టీల్ ప్లాంట్.. మూడేళ్లయినా ఫలితం సున్నా
స్టీల్‌ప్లాంట్‌కి రైలు, రోడ్డు అనుసంధానం కోసం 67వ జాతీయ రహదారిని కలుపుతూ ఏడున్నర కిలోమీటర్ల రోడ్డును రూ. 22.50 కోట్లతో నిర్మిస్తామన్నారే.. ఎన్నేళ్లకు ఆ రోడ్డు పూర్తవుతుంది? గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్‌లైన్ వేస్తామని అన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో 29.67 ఎకరాలను సేకరించారు. అంతే.. అక్కడితోనే పైపులైను పనులు ఆగిపోయాయి. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు తలమంచిపట్నం సబ్ స్టేషన్ నుంచి ప్రత్యేకంగా 220 కేవీలైన్ నిర్మిస్తున్నామన్నారు. కానీ, ఆ సబ్‌స్టేషన్‌కు ‘పవర్’ ఇచ్చే పనులు చేపట్టలేదు.