కడప జిల్లా మైలవరం మండలంలో అధికార హోదాను అడ్డుపెట్టుకుని ఓ ఎమ్మార్వో, స్థానిక నాయకులతో కలిసి భారీ స్థాయిలో భూ అక్రమాలకు తెరలేపారు. మండలంలో ఇటీవల రెవెన్యూ రికార్డుల్లో పలు మార్పులు జరిగాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎం.కంబాలదిన్నెలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 3,500 ఎకరాలు కేటాయించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె సమీపంలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 2019 డిసెంబరు 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మైలవరం మండలంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌరపార్కు ఏర్పాటుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా సమీపంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు నాయకులు రంగంలోకి దిగారు. సుమారు వందకుపైగా ఎకరాల్లో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినందుకు బదులుగా ఆయన(తహశీల్దార్) పెద్ద మొత్తంలోనే సంపాదించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అనువంశీకం కింద జిరాయితీ పట్టాలు..
గతేడాది మండలంలో ఆన్‌లైన్‌లో కొన్ని భూముల వివరాలను అక్రమంగా మార్చడంతో.. అప్పట్లో ప్రభుత్వ రికార్డుల్లో ఎమ్మార్వో డిజిటల్ సంతకం చేయడానికి వీల్లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తర్వాత కొన్ని నెలలపాటు దీనికి అడ్డుకట్ట పడింది. ఉద్యోగ విరమణ దగ్గర పడేసరికి డబ్బులు సంపాదించడానికి ఇదే చివరి అవకాశమని ఎమ్మార్వో ఆశపడి మళ్లీ అక్రమాలు మొదలుపెట్టారు. ప్రభుత్వ భూముల్లో పలువురికి అనువంశీకం కింద జిరాయితీ పట్టాలు కేటాయించారు. వాటి వివరాలను అడంగల్, 1బిలో అక్రమంగా మార్చేశారు. ఇందుకోసం వారినుంచి భారీగా సొమ్ములు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రికార్డుల సాక్షిగా..
మైలవరం మండల పరిధిలో కొన్ని గ్రామాల్లో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వ రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. అత్యధిక శాతం సర్వే నంబర్లకు ఎమ్మార్వో డిజిటల్ సంతకం పూర్తి కాలేదని అడంగల్‌లో పేర్కొన్నారు. కొన్ని వాటిల్లో సంతకం కూడా చేశారు. గత రెండేళ్లలో రెవెన్యూ రికార్డుల్లో చేసిన మార్పులపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపడితే భారీ కుంభకోణం వెలుగులోకి వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మార్పులు చేశారిలా!..
తలమంచిపట్నం 702-1 సర్వే నెంబరులో (స.నెం.) 224.09 ఎకరాల విస్తీర్ణంలో సాగుకు పనికిరాని ప్రభుత్వ భూమి ఉంది. 702-2 స.నెం.లో 0.1 ఎకరం విస్తీర్ణంలో వాగుకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల కొత్తగా 702/1, 702/2, 702/3 స.నెం.లను సృష్టించి.. ఒక్కోదాని పరిధిలో ఒక వ్యక్తి పేరిట రెండెకరాల ప్రభుత్వ భూమిని అనువంశీకం కింద కేటాయించినట్లు అడంగల్‌లో పేర్కొన్నారు.
ధన్నవాడ 488 స.నెం.లో 529.37 ఎకరాల విస్తీర్ణంలో సాగుకు పనికిరాని ప్రభుత్వ భూమి ఉంది. కొత్తగా 488/1, 488/2, 488/3, 488/4, 488/5, 488/6, 488/7, 488/8, 488/9, 488/10 స.నెం.ల కింద కొన్ని భూములను విభజిస్తూ వాటిని అనువంశీకం కింద కొందరికి కేటాయిస్తూ రెవెన్యూ రికార్డులో పేర్కొన్నారు. 519/1ఏ, 535/4, 537/4, 537/5, 539/2, 539/3, 539/1, 539/4, 539/5 స.నెం.లలో కూడా ఇలాగే చేశారు.