కడప జిల్లాలోని బద్వేలు ఉప ఎన్నిక(badwel bypoll) సందర్భంగా.. నియోజకవర్గ పరిధిలో సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం.. ఈ నెల 30న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఖాళీ అయిన బద్వేలు స్థానానికి అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బద్వేలు ఉపఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు.
వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధ
బద్వేలు ఎన్నికలో వైకాపా అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య భార్య.. డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రులు కూడా ఉప ఎన్నికపై దృష్టిసారించారు. క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తూ.. పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ బైపోల్లో లక్ష మెజార్టీ సాధించటమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
భాజపా అభ్యర్థిగా సురేష్...
బద్వేలు ఉప ఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేష్‌ను ఎంపిక చేశారు. పెనగలూరు మండలానికి చెందిన సురేష్.. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏబీవీపీ తరఫున, భాజపా తరఫున జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన సురేష్ ఉన్న పేరు ప్రతిష్ఠలు.. ఎన్నికల్లో కలిసి వస్తాయని భావిస్తున్నారు కమలనాథులు.