పసిడి వర్తకంలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉండటంతో బులియన్ మార్కెట్‌తో సంబంధం లేనివారు కూడా వ్యాపారం మొదలు పెట్టారు. కోయంబత్తూరు, చెన్నైల నుంచే ప్రొద్దుటూరుకి బంగారు సరఫరా జరుగుతోంది. దీంతో ప్రతి వ్యాపారికి అక్కడి నుంచి బంగారం తీసుకొస్తున్న వారెవరో తెలిసిపోతోంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ముగ్గురు దొంగలు కోయంబత్తూరు నుంచి రైల్లో బంగారు తీసుకొస్తున్న వ్యాపారిని అటకాయించారు. చిత్తూరు జిల్లా పాకాల సమీపంలో తాము రైల్వే పోలీసులమంటూ బెదిరించారు. తెస్తున్న బంగారానికి బిల్లులు చూపాలంటూ డిమాండు చేశారు. బిల్లులు లేని కారణంగా ఆ వ్యాపారి వారిని నిలువరించలేకపోయారు. దీంతో దొంగలు 1.5 కేజీల బంగారాన్ని తీసుకొని పరారయ్యారు. వీరిలో కడప జిల్లా ఎర్రగుంట్ల ప్రాంతానికి చెందిన ఇద్దరు, జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రొద్దుటూరుకు చేరుకుని స్థానిక మార్కెట్‌లో ఆభరణాల రూపంలో ఉన్న బంగారాన్ని కరిగించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఆరుగురు వర్తకులకు కరిగించిన బంగారాన్ని అమ్మినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో ప్రొద్దుటూరులోని ఇద్దరు షేఠ్‌లు చెరో 250 గ్రాముల చొప్పున అరకేజీ బంగారాన్ని కొన్నట్లు చర్చ నడుస్తోంది. మరో ముగ్గురు మిగిలిన బంగారాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. సాధారణ మార్కెట్ కంటే 5 శాతం తక్కువ ధరకే దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
వ్యాపారికి దొంగలు బురిడీ.. కిలోన్నర బంగారం చోరీ - new techniques
అడ్డదారుల్లో బంగారాన్ని కాజేసిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. సులువుగా డబ్బులు సంపాదించాలనుకోవడం, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో కొత్త తరహా మోసాలకు దొంగలు పాల్పడుతున్నారు. ఏకంగా బంగారు ఎక్కడి నుంచి వస్తోందో కనుగొని అక్కడే దొంతనానికి పాల్పడ్డారు.
మోసపోయిన వ్యాపారి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన రైల్వే పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారు విక్రయించిన బంగారానికి సంబంధించిన రసీదుల ద్వారా ప్రొద్దుటూరులో ఏయే వ్యాపారికి ఎంత మొత్తంలో బంగారం అమ్మారో లెక్క కట్టారు. మొత్తం ఆరుగురు స్థానిక వ్యాపారులకు దొంగలించిన బంగారు అమ్మినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. బంగారు కొనుగోలు చేసిన వ్యాపారులను రికవరీ కోసం పోలీస్టేషన్‌కు పిలిచినట్లు తెలుస్తోంది.