Giri Pradakshina in Pushpagiri: వాస్తవానికి గిరి ప్రదక్షిణలకు హేతువు, మూలాధారమైన దక్షిణ కాశీగా పేరొంది.. చారిత్రకంగా ప్రసిద్దిగాంచిన వైయస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలంలోని పుష్పగిరి. గిరి ప్రదక్షిణ నిర్వహించే విషయం నేటి తరానికి తెలియదు. వందేళ్ల క్రితం పుష్పగిరిలో గిరి ప్రదక్షిణ అట్టహాసంగా జరిగి పరిస్థితుల ప్రభావంతో నిలిచిపోయిన అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ స్థితిలో పుష్పగిరికి శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహ సంస్థాన పీఠాధీశ్వరులు శ్రీ విభూషిత శ్రీ విద్యాశంకరభారతి స్వామి రాకతో మళ్లీ ఇక్కడ గిరి ప్రదక్షిణకు పున:ప్రారంభమైంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో సింహాచలంలో నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ ఉత్తరాంధ్ర ప్రజలకు చిరపరిచితమే.. ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణను నిర్వహిస్తున్నారు. అదేరీతిలో తెలుగురాష్ట్రాల్లో పలు దేవాలయాల్లోనూ క్రమక్రమంగా గిరి ప్రదక్షిణలను ప్రారంభిస్తున్నారు.
పుష్పగిరి చరిత్ర..: 100 సంవత్సరాల క్రితం పుష్పగిరి పుణ్యక్షేత్రానికి సంబంధించి దాదాపు 100 శివాలయాలకుపైగా కొండ చుట్టూ ఉండేవి. ఆకారణంగా ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే 100 శివాలయాలను సందర్శించి పుణ్యం కలుగుతుందని భక్తుల్లో విశ్వాసం ఉండేది. ఆ విధంగా గిరి ప్రదర్శనకు గతంలో అంకురార్పణ జరిగింది. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు కోరుకున్న కోరికలు ఆ మహానుభావుడు తీరుస్తాడని భావిస్తారు. సంతానం లేని వారు గిరి ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకం ప్రబలంగా ఉంది.
శివాలయాలు శిథిలావస్థతో గిరి ప్రదక్షిణకు ఆటంకం..: కొన్నాళ్లకు అక్కడి శివాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ కూడా ఆగిపోయిందని చెబుతున్నారు. అనంతరం ఇప్పుడు పీఠాధిపతుల అనుమతులు తీసుకొన్న హిందూ పరిషత్ ముఖ్యులు మార్చి 1వ తేదీన మళ్లీ ఈ గిరి ప్రదర్శనను ప్రారంభించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప పట్టణానికి 16 కి.మీ. దూరంలో ఉంది.
ఆదిశంకరులు సందర్శించిన పుణ్యభూమి..: ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు.
పుష్పగిరి దేవాలయం..:ఈ గ్రామాన్ని గురించి తెలుగులో తొలి యాత్రాచరిత్రగా చెప్పబడే కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో ఈ గ్రామంలో 1830 సంవత్సరాంతంలో విడిది చేశారు. ఆ సమయంలో తాను గమనించి గ్రామవిశేషాలను గ్రంథంలో చేర్చుకున్నారు. గ్రంథంలో ఆయన పుష్పగిరి గురించి ఇలా వ్రాశారు: పుష్పగిరి పుణ్యక్షేత్రము. పినాకినీ తీరము. నది గట్టున కొండ వెంబడిగా రమణీయమైన యొక దేవస్థల మున్నది. అది హస్తినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్త పీఠాధిపతి అయిన పుష్పగిరి స్వాములవారు, అక్కడ మఠము గట్టుకొని నివాసము చేస్తున్నారు. 18 బ్రాహ్మణ గృహములున్నవి. అక్కడి బ్రాహ్మణులు కొంత వేదాంత విచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకు పేటకు పోవలెగాని, అక్కడ దొరకవు. నది దాటి ఊరు ప్రవేశించవలెను, మళ్లీ నది దాటి బాటకు రావలెను. ఊరు రమ్యమైనది.
పురాణ ప్రాశస్త్రం..: ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండేది. గరుత్మంతుడు ఇంద్రుని అమృతభాండాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికీ పోరాటం జరిగింది. ఆ సమయంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి యౌవనం లభించేది, అమరత్వమూ సిద్ధించేది. దేవతలు భయపడి శివుణ్ణి ఆశ్రయించారు. శివుడు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలే తేలింది. అదే పుష్పగిరి అయింది అని పురాణంలో ప్రస్తావన ఉంది.
పంచనదీక్షేత్రం..: పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు. పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించారు. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.
హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి..: శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. పరీక్షిత్తు వంశాన్ని నిర్వీర్యం చేయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.