ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయితీలను కాజేస్తూ.. కోట్లలో మింగేస్తున్నారు - gas agencies in kurnool district news update

ప్రస్తుత రోజుల్లో ఇంట్లో గ్యాస్ లేకుంటే ఇట్టిల్లపాది పస్తులుండాల్సిందే. కుటుంబంలో భాగమైపోయిన గ్యాస్ బండ కోసం మధ్య తరగతి వారు రోజులు తరబడి ఎదురు చూడాల్సిందే. ఒక్కోసారి 10 రోజులపైనే వేచి ఉండాల్సి వస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇదంతా మధ్యతరగతి వాళ్లకు మాత్రమే. అదే చిరు వ్యాపారులకు, తిను బండారాలకు, కార్లకు అక్రమంగా గ్యాస్ ఎక్కించి వాడేవాళ్లకు ఇలా చిటికేస్తే చాలు.. అలా గ్యాస్ బండ వచ్చి వాలుతుంది. అయినప్పటికీ పట్టించుకున్న అధికారే లేడు.

gas illegal useing
గ్యాస్ రాయితీలు కాజేస్తూ పెద్ద ఎత్తున దందా

By

Published : Nov 9, 2020, 11:17 AM IST

జిల్లాలో గ్యాస్ వినియోగం ..

కర్నూలు జిల్లాలో మొత్తం 68 గ్యాస్‌ ఏజెన్సీలున్నాయి. 11.48లక్షల గృహ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా ఎంత లేదన్నా 6.90 లక్షల సిలిండర్లు వినియోగిస్తున్నారు. కొన్ని ఏజెన్సీలు గ్యాస్ బండలు ఎక్కువగా ఉపయోగించని కుటుంబాలను గుర్తించి వారి పేరు పై ఏజెన్సీ సిబ్బందే గ్యాస్‌ బుక్‌ చేసి బయట విపణిలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు డోన్‌ ఘటనతో తెలుస్తోంది. ఇలా సేకరించిన వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో ఒక్క గ్యాస్ బండను రూ.900 నుంచి వెయ్యి వరకు అమ్ముతున్నారు. వాణిజ్య వ్యాపార సముదాయాల్లో రాయితీ సిలిండర్లును భారీగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది.

కొద్ది కొద్దిగా కాజేస్తూ...

ఇదంతా ఒకరకం దందా అయితే.. మరోవైపు గోదాంల నుంచి బయటకు తెచ్చే గ్యాస్ బండల నుంచి కేజీకి పైగా గ్యాస్​ను కొల్లగొడుతున్నట్లు సమాచారం. ఒక్కో బండలో 14.2 కిలోల గ్యాస్‌కు బదులు కేజీ అక్రమంగా దోచేస్తున్నారు. నిబంధనల ప్రకారం వినియోగదారుడికి సిలిండర్‌ ఇచ్చే సమయంలో తూకం వేసి ఇవ్వాల్సి ఉంది. ఇది ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో సరాసరిన ఒక్కో గ్యాస్ బండ నుంచి కేజీ గ్యాస్‌ మాయం చేసినా.. నెలకు సరాసరి 50 వేల సిలిండర్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. వెయ్యి చొప్పున అమ్ముతూ నెలకు రూ.5 కోట్ల వరకు అక్రమార్జన చేస్తున్నా అధికారులకు కనిపించడం లేదు.

మొక్కుబడిగా వ్యవహరిస్తున్న అధికారులు:

గృహ వినియోగ గ్యాస్ బండలను.. కార్లకు ఎక్కిస్తూ మరికొందరు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతోపాటు గ్యాస్‌ దీపాలు, చిన్న (5 కేజీ) గ్యాస్‌పొయ్యిలకు కిలోల చొప్పున అక్రమంగా రాయితీ గ్యాస్‌ అమ్ముతున్నారు. విచిత్రమేమంటే ఉదయం, సాయంత్రం ఫలహారం అమ్మే తోపుడు బండ్లు, బజ్జీ, చికెన్‌ పకోడి, టీ కొట్లలో అత్యధికంగా గృహ వినియోగానికి ఉపయోగించే రాయితీ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. ఇలా పలు రకాలుగా వంట గ్యాస్‌ వాణిజ్యమైంది. అక్రమార్కులు గ్యాస్‌ను దొడ్డిదారిన అమ్ముకుంటూ ప్రభుత్వ రాయితీని మింగేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన పౌరసరఫరాలశాఖ అధికారులు మొక్కుబడిగా వ్యవహరించడం మరింత అశ్చర్యాన్ని కలిగిస్తోంది.

గ్యాస్ బుకింగ్​పై విశ్రాంత జడ్జి ఆవేదన

గ్యాస్‌ బుక్‌ చేయకుండానే చరవాణికి సందేశాలు వస్తున్నాయి. సబ్సిడీ రూ.42 పడుతున్నాయి. ఇలా మూడు బుకింగ్‌లు చేశారు. రెండుసార్లు ఏజెన్సీ దృష్టికి వెళ్లినా స్పందన లేదు. గట్టిగా అడిగితే కనెక్షన్‌ రద్దు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదీ ఓ విశ్రాంత జడ్జి ఆవేదన. డోన్‌లో జరిగిన ఈ తంతుపై ఆయన భారత్‌పెట్రోలియం ప్రధాన కార్యాలయం ముంబాయికి ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి...

ముగియనున్న పాఠశాలల పునర్విభజన ప్రక్రియ... ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రాధాన్యం

ABOUT THE AUTHOR

...view details