ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి ముఠా అరెస్ట్​..రూ. కోటికిపైగా విలువైన సరకు స్వాధీనం - కడప జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్

కడప జిల్లాలో గంజాయి ముఠా గుట్టు రట్టైంది. కోటి రూపాయలకు పైగా విలువ చేసే సరకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏడు సెల్​ఫోన్లు..ఒక ద్విచక్రవహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అధికమొత్తంలో గంజాయి పట్టుబడటం ఇదే తొలిసారి.

Ganja Muta arrest
Ganja Muta arrest

By

Published : Oct 20, 2020, 9:12 PM IST

కడప జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్దమొత్తంలో గంజాయి పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు రాజంపేట మండలంలోని అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల వెనుక వైపున గంజాయి విక్రయాలు జరుపుతున్న ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు కలిపి మొత్తం 8 మందిని సోమవారం ఉదయం అరెస్టు చేసినట్లు కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

వీరి వద్ద నుంచి రూ.కోటికిపైగా విలువ చేసే సుమారు 52 కిలోల గంజాయి, ఏడు సెల్​ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం అటవీ ప్రాంతాల్లో 500 కుటుంబాలు సుమారు 400 ఎకరాల్లో జూన్‌- జనవరి మధ్యలో గంజాయి పండిస్తారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి గంజాయి కోసం వచ్చేవారికి నాణ్యతను బట్టి కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు ఏజెంట్ల ద్వారా అమ్ముతారు. వివిధ రాష్ట్రాల నుంచి గంజాయి కొనడానికి వచ్చేవారిని దాన్ని సాగుచేసే వారి వద్దకు తీసుకెళ్లినందుకు ఏజెంట్లు ప్రతి కిలోపై రూ.200 నుంచి రూ.300 వరకు కమీషన్‌ పొందుతారు.

ప్యాకింగ్‌, పైలటింగ్‌ ఖర్చుల నిమిత్తం గంజాయి కొనేవారి నుంచి సుమారు రూ.1000 నుంచి రూ.2,000 వరకు వసూలు చేస్తారు. పోలీసులు అరెస్టు చేసినవారిలో విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు కడప జిల్లాకు చెందిన ఆరుగురు ఉన్నారు. కేసులో విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలానికి చెందిన వంతల వెంకటరావు (19) ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈయనపై ఇంతకుముందే కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో గంజాయి కేసు, చింతపల్లి పోలీసుస్టేషన్‌లో గొడవపడిన కేసులు ఉన్నాయి. ఈయన 9వ తరగతి పూర్తి చేశాక చదువు మానేసి గంజాయి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సుమారు అయిదారేళ్లుగా తాను సాగుచేసిన గంజాయిని ఎండబెట్టి, గోతాల్లో దాచి ఉంచి ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. చింతపల్లి మండలానికి చెందిన కొండేజి మురళీకృష్ణ సుమారు ఏడాది నుంచి వెంకటరావు వద్ద గంజాయి వ్యాపారం చేయడానికి ఏజెంటుగా చేరారు. ఈయన 2019లో ఇంటర్మీడియట్‌ చదువు మానేసి కేబుల్‌ పనులు చేస్తున్నారు. గంజాయి కొనడానికి దూరప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను పోలీసులు పట్టుకోకుండా వీరిద్దరూ నర్సీపట్నం, తుని వరకు ద్విచక్రవాహనాలపై పైలటింగ్‌గా వెళ్తూ ఉంటారు.

వెంట్రుకల వ్యాపారం ముసుగులో...
ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలోని ఎస్టీ కాలనీలో నివసించే మేనపాటి లక్ష్మీదేవి (42) వెంట్రుకల వ్యాపారం చేస్తోంది. ఈమె వెంకటరావును పరిచయం చేసుకుని ఆయన వద్ద ఒక ట్రిప్పునకు 20-30 కిలోల గంజాయి కొనుగోలు చేస్తుండేది. దాన్ని తన వదిన సరోజ, సుబ్బారెడ్డి, రాముడు కలిసి ఇతరులకు అధిక ధరకు విక్రయిస్తారు. లక్ష్మీదేవి చెప్పిన వారికే సోదరుడు పడిగ హనుమంతు (58) గంజాయి అమ్ముతుంటాడు. ప్లాస్టిక్‌ సామగ్రి వ్యాపారం చేసే సాకే సరోజ (42) సుమారు రెండేళ్ల నుంచి అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయిస్తోంది.

ఈమె కొన్నిసార్లు గంజాయి అప్పుగా ఇచ్చి తర్వాత ఆ డబ్బులు రాబడుతుంది. కడప జిల్లా పెనగలూరు మండలం చక్రంపేట గ్రామానికి చెందిన కంచర్ల సుబ్బారెడ్డి (65) గంజాయిని చిన్న పొట్లాల్లో వేసి ఒక్కోదాన్ని రూ.250 నుంచి రూ300కు విక్రయిస్తారు. కడప జిల్లా పులివెందుల పట్టణానికి చెందిన సాతుపాటి రాముడు, లక్ష్మీదేవి దంపతులు చిన్న పొట్లాల్లో గంజాయి వేసి కళాశాల విద్యార్థులు, కూలీలకు అమ్ముతుంటారు. ఈ విధంగా వీరు కిలోకు రూ.15వేలకుపైగా లాభం పొందేవారు. అత్యధిక మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నందుకు రాజంపేట గ్రామీణ సీఐ నరేంద్రరెడ్డి, మన్నూరు ఎస్‌.ఐ.రోషన్‌, ఇతర సిబ్బందికి ఎస్పీ నగదు బహుమతి అందించారు. కార్యక్రమంలో రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:దేశంలో తొలిసారి ఇంగువ సాగు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details