ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గండికోటలో పర్యాటకుల సందడి.. ఆందోళనలో ప్రజలు - kadapa district latest news

కరోనా వైరస్​ కారణంగా పర్యాటక కేంద్రమైన గండికోట కొంతకాలంగా సందర్శకులు లేక వెలవెలబోయింది. మూడు నెలల తర్వాత ఈ నెల 7వ తేదీన పర్యాటకులకు అనుమతి ఇచ్చారు. శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి పెరుగుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల వల్ల తమ ప్రాంతంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ స్థానికులు కోటలో ఉన్న పురావస్తు శాఖ సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.

gandikota near living people afrais of tourists because of corona effect in kadapa district
స్థానికులను వెంటాడుతున్న కరోనా భయం

By

Published : Jul 14, 2020, 12:46 PM IST

కరోనా వైరస్​ ప్రభావం వల్ల ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట సుమారు మూడు నెలలు బోసిపోయింది. నిత్యం సందర్శకులతో కళకళలాడే కోట ఇన్నాళ్లూ నిర్మానుష్యంగా మారింది. కోటను చూసేందుకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్చి చివరి వారంలో కోటను మూసివేశారు. పురావస్తు శాఖ అధికారుల సూచన మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి పర్యాటకులకు అనుమతి ఇచ్చారు. 10వ తేదీ వరకు ఎలాంటి సమస్య రాలేదు. శని, ఆదివారాల్లో పర్యాటకుల సంఖ్య రెట్టింపు కావడం వల్ల స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తే కరోనా వ్యాపిస్తుందని సోమవారం కొంతమంది స్థానికులు కోటలో ఉన్న పురావస్తు శాఖ సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది. కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.

  • జిల్లాల్లో పురావస్తుశాఖ పరిధిలో మొత్తం 9 కట్టడాలు ఉన్నాయి. గండికోట, దానవులపాడు, సిద్ధవటం కోట, అత్తిరాల త్రేతేశ్వర స్వామి ఆలయం, పుష్పగిరి, చిలంకూరు శివాలయం, ఒంటిమిట్ట, పెద్దముడియంలోని ఆలయాలను ఆ శాఖ పర్యవేక్షిస్తోంది.
  • కొవిడ్​-19 ప్రబలకుండా మార్చి చివరి వారం వరకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించిన విషయం తెలిసిందే. అనంతరం విడతల వారీగా లాక్​డౌన్​ ఎత్తివేశారు. పర్యాటక రంగానికి మాత్రం అనుమతులు ఇవ్వలేదు. వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తే కరోనా మరింత ప్రబలే ప్రమాదముందని పురావస్తుశాఖ అధికారులు అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి కట్టడాలను దర్శించుకునేందుకు పర్యాటకులకు అనుమతులు లభించాయి. ఈ నెల 12వ తేదీన సుమారు 200 మంది వరకు పర్యాటకుల కోటను సందర్శించి ఉంటారని అంచనా. దీంతో సోమవారం కొంత మంది గండికోట గ్రామానికి చెందిన యువకులు పురావస్తుశాఖ సిబ్బంది వద్దకు వెళ్లి పర్యాటకుల అనుమతి విషయమై గొడవకు దిగినట్లు తెలిసింది.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

గండికోట చాలా విశాలమైన ప్రాంతం. పర్యాటకులు కాస్త జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఉన్నతాధికారుల ఆదేశానుసారమే కోటలోకి సందర్శకులకు అనుమతిస్తున్నాం. ఈ విషయమై సోమవారం కొంతమంది తమ సిబ్బందిని ప్రశ్నించిన విషయం మా దృష్టికి వచ్చింది. పర్యాటకుల కోసం కోటలో శానిటైజర్లు అందుబాటులో ఉంచాం. త్వరలో ఉష్ణోగ్రతలు తెలిపే యంత్రాలను పంపిస్తున్నాం. పర్యాటకులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి.

- గడ్డం శ్రీనివాసులు, కడప పురావస్తుశాఖ అధికారి

ఇదీ చదవండి :

గండికోట ముంపు గ్రామాల బాధితులకు రూ.522కోట్లు విడుదల

ABOUT THE AUTHOR

...view details