Uday Kumar Role in the Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కుట్ర గురించి నిందితుడు గజ్జల ఉదయకుమార్‌రెడ్డికి ముందే తెలుసని సీబీఐ వెల్లడించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున తల్లికి ఇదే విషయాన్ని చెప్పి బయటికి వచ్చినట్లు పేర్కొంది. తర్వాత పులివెందులలో అటూఇటూ తిరిగి ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లారని తెలిపింది. ఉదయం 6.25కు అవినాష్‌రెడ్డి ఇంట్లోను, 6.27కు వివేకానందరెడ్డి ఇంటి బయట, 6.29 నుంచి 6.31 మధ్య వివేకా ఇంట్లో ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా ఫోరెన్సిక్ పరిశీలనలో తేలిందని చెప్పింది. ఘటనా స్థలంలో సాక్ష్యాలను తుడిచేయడంలో వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, గంగిరెడ్డి, ఇతర నిందితులతో కలిసి ఉదయ్‌కుమార్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది.
ఈ హత్య కేసులో అరెస్ట్ చేసిన ఉదయ్‌కుమార్‌రెడ్డిని కస్టడీకి కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. పలుమార్లు విచారించినా దర్యాప్తునకు సహకరించడం లేదని, తెలిసిన వాస్తవాల గురించి చెప్పకుండా మాట మార్చుతూ, సమాధానాలను దాటవేస్తున్నారని, కుట్రపై దర్యాప్తు కొనసాగించడానికి 10 రోజుల కస్టడీ అవసరమని తెలిపింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి తదితరులు ఈ కుట్రలో భాగస్వాములని దర్యాప్తులో తేలిసిందని సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లో చెప్పింది. దాని సారాంశమిదీ.
- కుట్రకు సహకారం.. ఆధారాల ధ్వంసంలో కీలకపాత్ర
2019 మార్చి 15న వివేకానందరెడ్డి చనిపోయారని తల్లికి చెప్పి ఉదయ్‌కుమార్‌రెడ్డి బయటికి వెళ్లిపోయారు. వివేకా చనిపోయినట్లు తెల్లవారుజామున 4 గంటలకే ఉదయ్‌కుమార్‌రెడ్డికి తెలుసని ఆయన తల్లి శకుంతల చెప్పినట్లు పొరుగింటిలోని టి.ప్రభావతి చెప్పారు. 2019 మార్చి 15 ఉదయం 3.35 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లి 4.01 గంటల వరకూ పులివెందులలో అటు ఇటూ తిరిగారు. అప్పటికి వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నకు, కుట్రలో పాల్గొన్న నిందితులకు తప్ప బయటి వ్యక్తులకు ఎవరికీ వివేకా హత్య గురించి తెలియదు.
వాచ్‌మెన్ రంగన్న కూడా బయటి వ్యక్తులకు ఎవరికీ చెప్పలేదు. హత్య కుట్రకు సహకరించడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో ఉదయ్‌కుమార్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. 15వ తేదీన ఉదయం ఉదయ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తదితరులు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. ఇతరుల నుంచి ఏదైనా సమాచారం వస్తే వెంటనే వెళ్లి ఆ సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు అక్కడ ఉన్నట్లు తేలింది. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలతో మాట్లాడానని మొత్తం వ్యవహారాలన్నీ వాళ్లు చూసుకుంటారని.. గంగిరెడ్డి ఇతర నిందితులకు చెప్పి వారితోపాటు వివేకా ఇంటికి వెళ్లినట్లు తేలింది.
- అవినాష్, భాస్కరరెడ్డి సూచనలతో వివేకాకు బ్యాండేజ్
వివేకా చనిపోయినట్లు అవినాష్‌రెడ్డికి ఉదయం 6.26కు ఎన్.శివప్రకాశ్‌రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. అనంతరం ఉదయ్‌కుమార్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఈసీ సురేందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు వివేకా ఇంటికి వెళ్లారు. తలపై గాయాలతో బాత్‌రూంలో రక్తపు మడుగులో ఉన్న వివేకాను చూశారు. తరువాత అవినాష్‌రెడ్డి తన వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి ఫోన్‌తో.. సీఐ శంకరయ్యకు ఫోన్ చేసి.. వివేకా గుండెపోటుతో రక్తపు వాంతులు చేసుకుని చనిపోయినట్లు తెలిపారు. భద్రత కోసం ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లను పంపాలనీ చెప్పారు.