Two Friends Committed Robbery In Friends House: మిత్రుని ఇంటికి భోజనానికి వెళ్లి అతని ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు ఇద్దరు ప్రబుద్ధులు. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనలో.. తల్లిదండ్రులు విహరయాత్రకు వెళ్లడంతో రూపేశ్ అనే వ్యక్తి తన మిత్రులను ఇంటికి భోజనానికి అహ్వానించాడు. భోజనానికి వచ్చిన మిత్రులు రూపేశ్ బయటకు వెళ్లడం గమనించి.. బీరువాలో ఉన్న 15 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. విహారయాత్ర ముగించుకుని ఇంటికి వచ్చిన రూపేశ్ తల్లిదండ్రులకు.. విషయం తెలియటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూపేశ్ ఇద్దరు మిత్రులను విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు.
కడప జిల్లాలోని దేవుని కడపకు చెందిన శ్రీనివాస్.. స్థానికంగా ఆర్ఎంపీ వైద్యునిగా పని చేస్తున్నాడు. అతని కూమరుడు రూపేశ్ను ఇంట్లోనే ఉంచి శ్రీనివాస్ తన భార్యతో కలిసి ఈ నెల 6వ తేదీన తిరుమలకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రూపేశ్ తన మిత్రులను ఇంటికి భోజనానికి పిలిచాడు. దీంతో ఇద్దరు మిత్రులు భోజనానికి రూపేశ్ ఇంటికి వచ్చారు. ఏదో అవసరం కోసం రూపేశ్ బయటకు వెళ్లాడు. ఈ సమయంలో బీరువాకు తాళాలు ఉండటం గమనించిన రూపేశ్ మిత్రులు.. అందులో ఉన్న 15 తులాల బంగారు నగలను దొంగిలించారు. వాళ్లు నగలు దొంగిలించిన విషయం రూపేశ్కు తెలిసి.. తల్లిందండ్రులు వచ్చిన తర్వాత చెప్పాడు.