ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భోజనం అని పిలుస్తారు... పేద వారి ఆకలి తీరుస్తారు..! - కడపలో ఉచిత భోజనం

ఒకపూట అన్నదానం చేయటం పరిపాటి. కానీ నిత్య అన్నదానం ఒకింత ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ పేదల కడుపు నింపేందుకు ఓ సొసైటీ నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాయం చేసే చేతులకు కుల,మత భేదాలు ఉండవని... ఆకలి తీర్చటం మాత్రమే తెలుసని నిరూపిస్తోంది. అది ఎక్కడో తెలుసుకుందామా....

free_meals_by_arrahman society kadapa district
భోజనం అని పిలుస్తారు... పేద వారి ఆకలి తీరుస్తారు

By

Published : Dec 17, 2019, 8:09 AM IST

భోజనం అని పిలుస్తారు... పేద వారి ఆకలి తీరుస్తారు..!

కడపకు చెందిన అర్రహ్మాన్ ఇందాదు సొసైటీనీ మహబూబ్ బాషా, జిలాని భాష అనే ఇద్దరు సోదరులు ప్రారంభించారు. ఇప్పటికే వీరు ప్రతి నెల సుమారు 400 మంది పేదలకు 15 రోజులకు సరిపడే నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్నారు. అంతటితోనే వీరి సేవ... ఆగలేదు. ఇటీవల అన్న క్యాంటీన్​లను వైకాపా ప్రభుత్వం రద్దు చేయటంతో పేద బడుగు బలహీన వర్గాల వారిని దృష్టిలో ఉంచుకొని నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పప్పు, రసం, ఊరగాయ....
ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు కడప పాత రిమ్స్ కూడలి వద్ద సుమారు 150 మందికి సరిపడా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉచిత భోజనం అంటూ అరుస్తూ వచ్చిన వారందరికీ..అన్నం పెట్టి పొట్టనింపుతున్నారు. కుల, మత భేదం లేకుండా వచ్చిన వారందరికీ అన్నం, పప్పు, రసం, ఊరగాయ భోజనం పెడుతున్నారు.
అన్న క్యాంటీన్ లేదు...
ఇన్ని రోజులు తమ కడుపు నింపిన అన్న క్యాంటీన్లు రద్దు చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ సొసైటీ నిర్వహకులు... పిలిచి మరీ భోజనం పెట్టడం సంతోషంగా ఉందంటున్నారు.
బయట తినాలంటే....
చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం జనం వస్తుంటారు. వారు బయట భోజనం చేయాలంటే కనీసం 50 నుంచి 80 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. వీరందరిని దృష్టిలో ఉంచుకొని ఈ ఆకలి తీర్చే కార్యక్రమానికి పూనుకున్నట్లు సొసైటీ నిర్వహకుడు తెలిపాడు. ఒక శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులు ఈ ఉచిత అన్నదానం చేస్తామని చెబుతున్నాడు.

ఇలాంటి అన్నదానాలు మనసున్న మరాజులే కాకుండా... ప్రభుత్వం సైతం ముందుకు రావాలని... అప్పుడే తమ లాంటి పేద వారి ఆకలి తీరుతుందంటున్నారు అక్కడ భోజనం చేసిన ప్రజలు.

ఇవీ చూడండి-తిమ్మమ్మ మర్రిమానును కాపాడుదాం... భావితరాలకు చూపిద్దాం!

ABOUT THE AUTHOR

...view details