ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YS VIVEKA MURDER : వైఎస్ వివేకా హత్య కేసులో ముమ్మరంగా నాలుగో దఫా విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. రెండో రోజు వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరితో పాటు వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్‌ను సీబీఐ అధికారులు సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. ముఖ్యంగా కారు డ్రైవర్ దస్తగిరి, చెప్పుల దుకాణం యజమాని మున్నా మధ్య సంబంధాలపై దర్యాప్తు సంస్థ ఆరా తీస్తున్నట్లు సమాచారం. రెండ్రోజుల్లో పులివెందులకు చెందిన కీలక వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశముందని తెలుస్తోంది.

fourth face inquiry on YS viveka murder case
వైఎస్ వివేకా హత్య కేసులో ముమ్మరంగా నాల్లో దఫా విచారణ

By

Published : Jun 9, 2021, 1:11 AM IST

Updated : Jun 9, 2021, 7:39 AM IST

వైఎస్ వివేకా హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ… నాల్గో దఫా విచారణను వేగంగా చేస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో మంగళవారం వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరితో పాటు వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే ఇదయ్ తుల్లాను విచారించింది. ఇద్దరినీ ఏడు గంటలకు పైగా ప్రశ్నించింది. గతంలో వీరిని దిల్లీకి పిలిపించి సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నించింది. దస్తగిరి విచారణకు ప్రధాన కారణం పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాతో ఉన్న సంబంధాలేనని తెలుస్తోంది. 2017 నుంచి 2018 వరకు వివేకా కారు డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి... మున్నా కుటుంబ వ్యవహారంలో వివేకా చేత పంచాయితీ చేయించినట్లు తేలింది. మున్నా ఇద్దరు భార్యల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు... వివేకా వద్దకు మున్నాను దస్తగిరి తీసుకెళ్లినట్లు సమాచారం.

లింగాల మండలం కామసముద్రానికి చెందిన దస్తగిరి... వివేకా కారు డ్రైవర్‌గా మానేసిన తర్వాత పులివెందులలో వ్యాపారం చేసుకుంటున్నాడు. కాపురం మాత్రం వైఎస్ కుటుంబీకులు నివాసముండే భాకరాపురంలోనే ఉంటున్నాడు. వివేకా హత్య జరిగిన తర్వాత దాదాపు ఐదు రోజుల పాటు చెప్పుల దుకాణం యజమాని మున్నాను సీబీఐ అధికారులు విచారించారు. దుకాణంలో నష్టాలు వస్తున్నాయని...దాన్ని మూసేసి అనంతపురం జిల్లా కదిరికి మకాం మార్చాడు. ఆ సమయంలో మున్నా బ్యాంకు లాకర్లో 48 లక్షల నగదు, 25 తులాల బంగారం ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఐపీ పెట్టడానికి సిద్ధంగా ఉన్న మున్నాకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీశారు. ఈ సందేహాల నివృత్తి కోసం పలుమార్లు కదిరికి వెళ్లిన సీబీఐ అధికారులు... మున్నాకు, దస్తగిరి మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలతో ఏమైనా అనుకోని ఘటనలు జరిగాయా అనే కోణంలో సీబీఐ ఆరా తీసింది.

మంగళవారం సీబీఐ విచారణకు హాజరైన దస్తగిరి... వారికున్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు తనను పిలిచారని చెప్పాడు. విచారణ విషయాలు బయటికి చెప్పవద్దని తనను ఆదేశించినట్లు వాపోయాడు. దస్తగిరి ద్వారా పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత.. అసలు సూత్రధారులు ఎవరనేది తేల్చేందుకు సీబీఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్నానూ మరోసారి విచారించే వీలుందని తెలుస్తోంది. రెండ్రోజుల్లో పులివెందులకు చెందిన కీలక వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. బందోబస్తు పరంగా పోలీసులను అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇదీచదవండి.

పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు... వేధిస్తున్న వైద్య పరికరాల కొరత

Last Updated : Jun 9, 2021, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details