కడప జిల్లా బద్వేలు మండలం కొంగలవీడు వ్యవసాయ పొలాల్లో 25 లక్షల రూపాయల విలువైన 32 ఎర్రచందనం దుంగలు, ఒక మినీ లారీని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల రాకను పసిగట్టిన దుండగులు అక్కడనుంచి పరారయ్యారు. ఎర్రచందనం దుంగలను లోడ్ చేసేందుకు మినీ లారీని నిన్న రాత్రి స్మగ్లర్లు వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్లారు. రాత్రి భారీ వర్షం కురవడంతో వాహనం పొలంలో ఇరుక్కుపోయింది. వాహనాన్ని బయటకు తీసేందుకు తెల్లవారేసరికి పోరాడారు. చివరకు చేసేదేమీ లేక అక్కడే వదిలేసి వెళ్లారు.
ఈ విషయం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన స్మగ్లర్లు అక్కడినుంచి పరారయ్యారు. అక్కడి పరిసరాలను వెతకగా.. 32 ఎర్రచందనం దుంగలు దొరికాయి. వీటితో పాటు మినీ లారీని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇవి రూ.25 లక్షల విలువ ఉంటాయని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.