Floods Impact at Thogurupeta:కడప జిల్లాలో వరద విలయం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. రాజంపేట పరిధిలో రెండు జలాశయాల మట్టికట్టలు తెగిపోవడం...ఆ ప్రవాహానికి ఊళ్లకు ఊళ్లే నేలమట్టం కావడం...కన్నీటినే మిగిల్చింది. పులపుత్తూరు, మందపల్లె, గుండ్లూరు తరహాలోనే.... తొగూరుపేటలోనూ వరద ఆనవాళ్లు ఇప్పట్లో చెరిగిపోయేలా లేదు. గ్రామంలో 54 ఇళ్లు ఉండగా.. ఏకంగా 44 ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. సుమారు 20 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్న మాట అటుంచితే ఇప్పుడు ఇక్కడి జనం అవస్థలివీ.
ఉండటానికి ఇళ్లు లేవ్... తినడానికి తిండీ లేదు. వరద పలకరించి వారం రోజులవుతున్నా.... తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేనేలేదు. మహిళలు స్నానాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు లేక...పక్కనే ఉన్న చెయ్యేరు నదే దిక్కైంది. నేతలకు ఎన్నికల సమయంలో ఉన్నంత హుషారు, సాయం చేయడంలో లేదని బాధితులు నైరాశ్యం వ్యక్తం చేస్తున్నారు.