కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెదేపా నేత నందం సుబ్బయ్య కుటుంబానికి ఆ పార్టీ నేతలు అండగా నిలిచారు. భారీ స్థాయిలో ఆర్థిక సహాయం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తరఫున 20 లక్షల రూపాయల చెక్కును.. ప్రొద్దుటూరు తెదేపా నేతలు మృతుడి భార్య అపరాజితకు అందజేశారు. అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ 5 లక్షలు, బీటెక్ రవి మరో లక్ష రూపాయలు చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం చేశారు. తెదేపా పొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఐదు లక్షలు.. రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి రెండు లక్షలు నగదు అందజేశారు.
ఈ మొత్తాన్ని ప్రొద్దుటూరు తెదేపా నేతలు సుబ్బయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. సుబ్బయ్యది రాజకీయ హత్యేనని తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సుబ్బయ్య భార్య అపరాజితకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హత్య కేసులో ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.