'సీఎం నియోజకవర్గంలోనే భూదందాలకు పాల్పడితే ఎలా?' - పులివెందుల రైతుల ఆందోళన
పులివెందులలో కంటికి కనిపిస్తే చాలు భూ కబ్జా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోరంబోకు స్థలాలు, నీటి కుంటలు...దేన్నీ అక్రమార్కులు వదలట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం నియోజకవర్గంలోనే ఇలా భూ దందాలకు పాల్పడితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
కడప జిల్లా పులివెందులలో భూకబ్జాలు ఎక్కువయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమి కనబడితే చాలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. పోరంబోకు స్థలాలపై, నీటి కుంటలను...ఏదీ వదలకుండా కంటికి కనిపించిన వాటిని కబ్జా చేస్తున్నారన్నారు. పులివెందుల కదిరి ప్రధాన రహదారిలో ఉన్న సర్వేనెంబర్ 145 లో ఉన్న నీటి కుంటను కబ్జా చేసి ప్లాట్లుగా మారుస్తూ ఉండడంతో... వెంకటాపురం గ్రామస్తులు దాదాపు 250 మందికి పైగా ధర్నాకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని సీఎం నియోజకవర్గంలోనే ఇలా భూ దందాలకు పాల్పడితే ఎలా అంటూ నినాదాలు చేశారు. భూ దందాలకు పాల్పడుతున్న భూబకాసురులను వెంటనే శిక్షించాలంటూ ధర్నాకు దిగారు. రోడ్డుపై ధర్నాకు దిగడంతో ఈ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.