Farmers lost their crops due to Rains: ఆరుగాలం కష్టించి పంటలు పండించే అన్నదాతను అకాల వర్షాలు నిలువునా ముంచేశాయి. అప్పులు చేసి పంటను పండిస్తే.. చేతికందాల్సిన సమయంలో పంట కళ్ల ముందే నేలకొరిగింది. దీంతో బాధిత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు. ముఖ్యంగా వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షం కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయి.
పెండ్లిమర్రి వీరపునాయిని పల్లె మండలాల్లోని నష్టపోయిన పంట పొలాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పరిశీలించారు. అరటి, చీని, నువ్వులు, దోసకాయ పంటలను పరిశీలించిన ఆయన లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికందే సమయంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అదే విధంగా వైయస్సార్ జిల్లా వీఎన్ పల్లి మండలం, పెండ్లిమర్రి, వేంపల్లి మండలాలల్లో ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం వేలాది హెక్టార్లలో పంటలకు అపార నష్టం మిగిల్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహా మండలి ఛైర్మన్ ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి, యువ నాయకుడు నరేన్ రామాంజుల రెడ్డిలతో కలిసి కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి.. నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.