ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరగా వచ్చింది వర్షం... అయినా లేదు ఆనందం! - కడపలో రైతులు వార్తలు

వరుణ దేవుడు కరుణించించటంతో కరవు నేలలో చినుకుల సవ్వడి మొదలైంది. అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఎప్పుడూ ఖరీఫ్ సాగు సమయంలో వర్షాలు లేక... ఆవేదనలో ఉండే రైతులు ఈ సారి త్వరగా వచ్చిన తొలకరితో సాగుకు సిద్ధమయ్యారు. కానీ పెట్టుబడి విషయంలోనే కుంగిపోతున్నారు.

అదునుకు వర్షం... రైతులకు ఎలా తీరేది కష్టం?
farmers happy with rain and sad with cost of farming at kadapa district

By

Published : Jul 5, 2020, 11:02 PM IST

మెట్ట భూములు అత్యధికంగా ఉన్న కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఈ వర్షం అధికంగా కురవటంతో రైతులు ఖరీఫ్ సాగు మొదలుపెట్టారు. బీడుగా ఉన్న పంట పొలాలన్నీ దున్ని... విత్తనాలు వేస్తున్నారు. కానీ వారికి పెట్టుబడి బాధలే ఎక్కువయ్యాయి.

సాగు అంతా ఇక్కడే

కడప జిల్లాలో అన్ని రకాల పంటలు కలుపుకొని 1.08 లక్షల హెక్టార్లలో సాగు చేయాలన్నది అధికారుల లక్ష్యం. అందులో 24 వేల హెక్టార్లలో వేరుశనగ సాగులోకి రానుందని వ్యవసాయ అధికారులు అంచనా. వేరుశనగతో పాటు మరో 22 వేల హెక్టార్లలో వరి సాగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 29 వేల టన్నుల వేరుశనగ రాయితీ విత్తనాలను రైతులకు గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ చేశారు. విత్తనం సిద్ధం చేసుకున్న సమయానికి వర్షం అనుకూలించగా.. రైతులు ఖరీఫ్ సాగులో నిమగ్నమయ్యారు. కడప జిల్లాలో ఖరీఫ్ కింద పంటలు సాగుచేసే రైతులకు అదునుకు మంచి వర్షాలు కురిశాయి. సాధారణంగా.. జూన్ నెలలో జిల్లా వ్యాప్తంగా 69.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 82.4 మిల్లీ మీటర్లు కురిసింది. జిల్లాలోని 51 మండలాలకుగాను 20 మండలాల్లో వర్షపాతం నమోదయ్యింది. ఈ మేరకు వరి సాగుకు నార్లు పోస్తున్నారు.

సాగు ఖర్చులు అధికం

సకాలంలో వర్షాలు పడ్డాయన్న ఆనందమే తప్ప రైతులకు కష్టాలు తప్పడం లేదు. సాగుకు పెట్టుబడి భారం అధికమవుతోంది. విత్తనాల కొనుగోలు నుంచి సేద్యపు పనులు, కూలీల ఖర్చులు పెరిగిపోతున్నాయి. దిగుబడి చేతికొచ్చే వరకు రైతుకు భరోసా లభించే అవకాశం లేదు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు కలుపితే పెట్టుబడి తడిసి మోపెడు అవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట సాగు సమయంలో పెట్టుబడి కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే కొంతవరకైనా రైతులకు చేయూత దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆర్థిక సమస్య తీరేలా.. వ్యాపారం సాగేలా..!

ABOUT THE AUTHOR

...view details