కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో నకిలీ బొప్పాయి విత్తనాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు వేల ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. నర్సరీ యజమానులు నకిలీ విత్తనాలు, నాసిరకం మొక్కలు విక్రయించడంతో పుష్పాలు రాలి దిగుబడి తగ్గిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే రకమైన వంగడం సాగు చేయడం వల్లే దిగుబడి తగ్గుతుందని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. పంట మార్పిడితో పంటలకు సోకే వైరస్‌లు, తెగుళ్లు నివారించవచ్చునని అంటున్నారు.
బొప్పాయి సాగులో అగ్రభాగం రెడ్ లేడీ రకం వంగడాన్ని రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. ఒకప్పుడు రెడ్ లేడీ రకం చాలా ప్రసిద్ధి చెందినదని.. ఇప్పుడు నాసిరకం విత్తనాల వల్ల కాయ పెరగటం లేదని రైతులు చెబుతున్నారు. రంగు, రుచిలోనూ తేడాలు కనిపించాయని చెప్పారు. పూత రాలిపోవటంతో దిగుబడి తక్కువగా ఉంటోందన్నారు. ఎకరాకు లక్షా ఇరవై వేలు పెట్టుబడి కోసం ఖర్చు అవుతోందని, నర్సరీలో జరిగే మోసాల వల్ల నష్టపోతున్నామని రైతులు వాపోయారు. అప్పు చేసి సాగు చేసిన వారి పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.