ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నవయసులో పెద్ద కష్టం!

ఈ రోజో..రేపో తమ భర్తలు వస్తారనుకున్నారు. ఆశగా గుమ్మాలవైపు ఎదురుచూస్తున్నప్పుడు .. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తమ భర్తలు సజీవదహనమై గుర్తుపట్టలేనంతగా చనిపోయారని తెలిసి ఆ మహిళలు ఏడ్చిన దృశ్యాలు అందరిని కలిచివేస్తున్నాయి. కొద్దిరోజుల ముందువరకు తమతో సంతోషంగా గడిపిన వారు.. ఉన్నట్టుండి ఓ ముఠా చేసిన ఛేజింగ్​లో చనిపోయారని తెలిసినపుడు అసలు ఎలా జరిగిందని అనే ప్రశ్నే వాళ్లలో మొదటగా వచ్చింది. ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో తెలియదు. అందరిది చిన్నవయసే..భర్తల శవాలను చూడటానికి భయపడిన అమాయకత్వం వారిది. ఓ బడా స్మగ్లర్​ చేయించిన ఎర్రదుంగల హైజాక్​లో భాగంగా కూలీలు మరణించగా..వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

red sandalwood workers death of tamilanadu
భర్తల మృతదేహాల కోసం ఎదురు చూస్తున్న భార్యలు

By

Published : Nov 6, 2020, 12:19 PM IST

కడప జిల్లా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాలో ఎర్రకూలీల మృతదేహాలు చూడడానికి వారి భార్యలు భయపడ్డారు. అయిదు మృతదేహాలలో నాలుగింటిని కుటుంబసభ్యులకు అప్పగించగా..బంధువులు రాకపోవడంతో శవాగారంలోనే చంద్రన్‌ మృతదేహం ఉంది. డీఎన్‌ఏ పరీక్షలకు వైద్యులు రక్త నమూనాలు సేకరించారు. కూలీ కోసం బయటికి వెళ్లి శవాలుగా తిరిగిరావడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇలాంటి కూలీలెందరో బడా స్మగ్లర్ల వేటలో అసువులు బాస్తున్నారు.

  • భర్తల మృతదేహాల కోసం ఎదురు చూస్తున్న భార్యలు

ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ వల్లూరు మండలం గోటూరు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో సజీవ దహనమైన అయిదుగురిలో నలుగురి మృత దేహాలను పోలీసులు బుధవారం వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. డీఎన్‌ఏ పరీక్షలకు కుటుంబసభ్యుల నుంచి ప్రభుత్వ వైద్యులు రక్తనమూనాలు సేకరించి కర్నూలు పంపారు. కాలిబూడిదైన మృతదేహాలను వారి కుటుంబసభ్యులు ప్రాథమికంగా గుర్తించినప్పటికీ నిబంధనల మేరకు రక్తనమూనాలు తీసుకున్నారు. మృతి చెందినవారిలో రామన్‌ ఆండీ (30), రామచంద్రన్‌ (25), మహేంద్రన్‌ (36), మృతియార్‌ (30) చంద్రన్‌ (28) ఉన్నారు. వీరిలో రామన్‌ ఆండీ, రామచంద్రన్‌, మహేంద్రన్‌ భార్యలు, రక్త సంబంధీకులు మంగళవారమే కడపకు రాగా, బుధవారం మృతియార్‌కు సంబంధించిన రక్త సంబంధీకులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. చంద్రన్‌కు సంబంధించిన వారెవ్వరూ రాకపోవడంతో మృతదేహాన్ని శవాగారంలో ఉంచారు.

  • కొనసాగుతున్న పోలీసుల గాలింపు

అయిదుగురు తమిళ కూలీలు మృత్యువాత పడటానికి బెంగళూరుకు చెందిన బడా స్మగ్లర్‌ పన్నాగమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు అతడి కోసం వేట ముమ్మరం చేశారు. బెంగళూరు ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. స్థానిక హైజాక్‌ గ్యాంగ్‌ ఇస్తున్న సమాచారంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బడా స్మగ్లర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న తమిళ కూలీ సతీశ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

  • భర్త లేడని తెలిసి దిగులుగా...
భర్త లేడని తెలిసి దిగులుగా

చిత్రంలో కనిపిస్తున్న ఈమె వల్లూరు మండలం గోటూరు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో సజీవ దహనమైన రామచంద్రన్‌ భార్య అనిత. ఈమె వయసు 20 ఏళ్లే. ఇంకా పిల్లల్లేరు. చిన్న వయసులో భర్తను పోగొట్టుకుని ఒంటరైంది. కూలి పనికి వెళ్తున్నామని చెప్పి వెళ్లి ఇలా మృత్యువాత పడతారనుకోలేదని కన్నీళ్లపర్యంతమైంది. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద ఒంటరిగా కూర్చుని దిగాలుగా కనిపించింది. ఈమే కాదు ఇదే ప్రమాదంలో సజీవ దహనమైన మిగిలిన నలుగురి భార్యలదీ ఇదే పరిస్థితి. అందరిదీ చిన్నవయసే. వీరిని చూస్తే అసలు లోకజ్ఞానమే తెలియనట్లున్నారు. భర్తల సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నారు. తమ భర్తలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారో కూడా తెలియని అమాయకులుగా కనిపిస్తున్నారు. ప్రమాదంలో కాలిబూడిదైన భర్తల మృతదేహాలను చూసేందుకు కూడా భయపడ్డారంటే వీరి పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు

  • బలై పోతోంది కూలీలే

ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు అక్రమంగా నరికించి విదేశాలకు తరలిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రధాన స్మగ్లర్లు నేరుగా పాల్గొనకుండా కూలీలతో పనులు చేయిస్తూ చేతికి మట్టి అంటకుండా పనికానిస్తున్నారు. ఎర్రచందనం చెట్లను నరకడంతో పాటు వాటిని శుభ్రంగా తగిన పరిమాణంలోకి మార్చడంలో తమిళ కూలీలు సిద్ధహస్తులు. అవి ఎంత బరువున్నా, ఎంత దూరమైనా మోసుకెళ్లే సామర్థ్యం వారికుంటుంది. దీంతో బడా స్మగ్లర్లు వారినే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కుటుంబ పోషణ కోసం ఎర్ర కూలీలు ఎర్రచందనం చెట్లను నరకడమే పనిగా పెట్టుకున్నారు. ఇది నేరమని తెలిసినా స్మగ్లర్లు పెద్ద మొత్తంలో ఇచ్చే డబ్బులకు ఆశపడుతున్నారు. ఎంత దూరమైనా, ఎన్నిరోజులైనా అడవిలో ఉండి స్మగ్లర్లు చెప్పిన పని పూర్తి చేసిన తరువాతే స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో బలయ్యేది ఎర్ర కూలీలే. బడా స్మగ్లర్లు రహస్య ప్రాంతాల్లో మకాం వేసి ఏజెంట్ల సాయంతో పని కానిస్తుంటారు. కూలీలతో ముందస్తు ఒప్పందం చేసుకుంటున్న స్మగ్లర్లు, వారిని నమ్మి రాష్ట్రం దాటి వచ్చిన కూలీలను సైతం మోసం చేస్తున్నారు. రూ.లక్షల మొత్తం కూలీలకు ఇవ్వలేక అడవి నుంచి బయటికి వచ్చిన తర్వాత జిల్లాలోని తమ సానుభూతిపరులతో ఎర్రచందనాన్ని హైజాక్‌ చేయిస్తున్న సందర్భాలు ఉన్నాయి. పోలీసులమని చెప్పి తమిళ కూలీల వాహనాన్ని వెంబడించడం, వాహనం అడ్డుపెట్టగానే కూలీలు పరారైతే.. వదిలి వెళ్లిన దుంగలను బడా స్మగ్లర్లకు చేర్చడం స్థానిక హైజాక్‌ గ్యాంగ్‌ పని. ఈ విధంగానే బెంగళూరుకు చెందిన బడా స్మగ్లర్‌ సూచన మేరకు రంగంలోకి దిగిన లోకల్‌ హైజాక్‌ గ్యాంగ్‌ వెంబడించడంతోనే సోమవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురై అయిదుగురు తమిళ కూలీలు మృత్యవాత పడ్డారు.

ఇదీ చూడండి.

దారికాస్తారు... దోచుకెళ్తారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details