Fake Fingerprints Gang Arrest: నకిలీ వేలిముద్రలతో బ్యాంకు ఖాతాల నుంచి నగదు కొల్లగొడుతున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 416 సైబర్ నేరాలకు పాల్పడి 5.9 కోట్ల రూపాయలను కొట్టేసినట్లు గుర్తించారు. వారి వద్ద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారికి చెందిన లక్షకు పైగా వేలిముద్రలు, ఆధార్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం ఉండటం ప్రస్తుతం సంచలనం రేకెత్తించింది.
Fake Fingerprints Gang: నకిలీ వేలిముద్రలతో డబ్బు మాయం.. నెల్లూరులో ముఠా అరెస్టు
కడప రామాంజనేయపురంలోని ఎలక్ట్రికల్ కాలనీకి చెందిన ఎస్. శంకరయ్య ఫోన్కు ఓటీపీ రాకుండానే ఆయన బ్యాంకు ఖాతా నుంచి 5వేల 500 రూపాయలు విత్ డ్రా అయ్యాయి. దీనిపై ఆయన కడప సైబర్ ఠాణాలో 2022 డిసెంబరు 13వ తేదీన ఫిర్యాదు చేయగా.. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కేసు నమోదు చేశారు. రెండు రోజుల కిందట వెంకటేష్ అనే వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా బాధితుడు శంకరయ్యకు ఫోన్ చేసి 'నీవు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో నా బ్యాంకు ఖాతా జప్తు చేశారు. నా ఖాతా తిరిగి యథాస్థితికి రాకుంటే నిన్ను చంపుతా, నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తా' అని బెదిరించాడు.
దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై ఏఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సైబర్ నేరగాళ్లు.. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం ద్వారా బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్లు, బ్యాంకు కస్టమర్ సర్వీసు పాయింట్ల నుంచి వేలిముద్రలను సేకరించి వాటికి కంప్యూటర్లో నకిలీలు తయారు చేసినట్లు తెలిసింది.