మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఐదోరోజు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ విచారణ జరుపుతోంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని వరసగా ఐదోరోజు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతనితోపాటు వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ కూడా వరసగా మూడు రోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరగడానికి 15 రోజుల ముందు కిరణ్ కుమార్ యాదవ్ వివేకాను కలిసినట్లు సీబీఐ ప్రాథమిక సమాచారం సేకరించింది.
మధ్యాహ్నం కడప నుంచి రెండు సీబీఐ బృందాలు పులివెందులకు వెళ్లాయి. వివేకా ఇంటిని ఓ బృందం మరోసారి పరిశీలిస్తోంది. నిన్న రాత్రి దాదాపు 3 గంటలపాటు పరిశీలించిన సీబీఐ అధికారులు.. ఇవాళ మరోసారి పరిశీలిస్తున్నారు. మరో సీబీఐ బృందం పులివెందులలోని సునీల్ కుమార్ యాదవ్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. సునీల్ కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్ ఇద్దరూ అన్నదమ్ములు. సునీల్ కుమార్ యాదవ్ వివేకాకు అత్యంత సన్నిహితుడు కావడంతో.. సీబీఐకి ఉన్న అనుమానాలతో సోదరులిద్దరినీ విచారిస్తోంది. దీంతోపాటు రవాణశాఖ అధికారులు కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు అనుమానాస్పద వాహనాల వివారలు సేకరిస్తున్నారు.
ఇప్పటి వరకూ విచారణ ఇలా..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. గత ఐదు రోజులుగా ఈకేసులో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన ఇదయతుల్లాతో పాటు పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.