Dr Sunitha Reddy : ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ సునీత నర్రెడ్డి.. క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారం అందుకున్నారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ యు.యు. లలిత్ .. ఆమెకు అవార్డు అందజేశారు. స్వైన్ ఫ్లూ, కొవిడ్ వంటి మహమ్మారుల కట్టడికి కృషి చేసిన డాక్టర్ సునీత నర్రెడ్డి.. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నుంచి ఏంబీబీఎస్ పట్టా పొందారు. అమెరికా డియర్ బర్న్లోని ఓక్ వుడ్ హాస్పిటల్స్‌లో ఇంటర్నల్ మెడిసిన్ లో ఎండీ పూర్తి చేశారు.
అమెరికా వేన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి సాంక్రమిక వ్యాధుల నియంత్రణలోనూ ఎండీ పట్టా పొందారు. పదేళ్లకుపైగా అమెరికాలో ఉన్న ఆమె.. 2009లో స్వదేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగంలో సేవలు అందించారు. ఆ తర్వాత నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద్వారా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఫెలోషిప్‌ను మొదలుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్ ఫ్లూ హెచ్1ఎన్1 మహమ్మారి నియంత్రణ నిపుణురాలిగా గుర్తింపు పొందారు.