''మా వాహనాన్ని ఆపితే లేనిపోని సమస్యలు వస్తాయి.. అసలు మీరెవరు వాహనాన్ని ఆపడానికి.. అవసరమైతే తొక్కించుకుని వెళ్తాం'' అంటూ.. ఇసుక మాఫియా రెవెన్యూ సిబ్బందిని హెచ్చరించింది. సిబ్బంది అడ్డుకున్నా లెక్క చేయక.. ఇసుక ట్రాక్టర్ తో ఢీకొట్టి మరీ వెళ్లిపోయారు. కడప జిల్లా సిద్ధవటం మండల పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు గాయపడ్డారు. ఎస్. రాజంపేట నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు మండల తహశీల్దార్ కు సమాచారం అందిన అనంతరం.. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వీఆర్వో ఆరిఫ్, వీఆర్ఏ వెంకటపతికి ఆదేశాలు వెళ్లాయి. ప్లాస్టిక్ పట్టా కప్పి ఉంచి వెళ్తున్న ట్రాక్టరును అనుమానంతో అడ్డుకోగా.. ఇసుకను రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. అనుమతి ఉందా అని ప్రశ్నించగా.. లేదని డ్రైవర్ చెప్పాడు. డ్రైవర్ తన యజమాని ప్రతాపరెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. ప్రతాప్ రెడ్డి తో పాటు అదే ప్రాంతానికి చెందిన రమణ వచ్చి ట్రాక్టర్ ఎందుకు ఆపావు అంటూ డ్రైవర్ని మందలించారు. ''మా ట్రాక్టర్లను ఆపితే మీకు బాగుండదు.. లేనిపోని సమస్యలు వస్తాయి'' అని ప్రతాప్ రెడ్డి ,రమణ.. రెవెన్యూ సిబ్బందిని హెచ్చరించారు. అంతటితో ఊరుకోక వీఆర్ఏ, వీఆర్వో లను దుర్భాషలాడారు. ''ట్రాక్టర్ ను తీసుకెళ్తాను ఏం చేస్తారో చేయండి'' అంటూ ప్రతాప్ రెడ్డి ట్రాక్టర్ తీసుకెళ్లాడు. రెవిన్యూ సిబ్బంది ఇద్దరు ద్విచక్ర వాహనంపై ట్రాక్టర్ ను అడ్డగించేందుకు ఎదురుగా వెళ్లగా వాళ్ళిద్దర్నీ ఢీకొన్నాడు. ప్రమాదంలో రెవిన్యూ సిబ్బంది ఇద్దరు గాయపడ్డారు. వారిని కడప రిమ్స్ కు తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
కడప జిల్లా సిద్ధవట్టంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమను అడ్డుకుంటున్నారని ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులను ట్రాక్టర్లతో ఢీకొట్టించగా.. వారు గాయపడ్డారు.
ఇసుక మాఫియా దాడి