ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Badwel bypoll 2021: బద్వేల్ ఉపఎన్నిక.. తెదేపా అభ్యర్థి ఖరారు..వైకాపా నుంచి ఎవరంటే..!

రాష్ట్రంలో ఉప ఎన్నిక వేడి మొదలైంది. కడప జిల్లా బద్వేల్​ నియోజకవర్గ బైపోల్​కు ఈసీ షెడ్యూల్​ ఇవ్వటంతో.. ప్రధాన పార్టీలు రంగంలోకి దిగనున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం..అభ్యర్థిని ప్రకటించగా.. అధికార పార్టీ వైకాపా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఓవైపు తెదేపా అభ్యర్థి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక వైకాపా నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ బరిలో ఉంటారనే చర్చ వినిపిస్తోంది. దీనిపై రేపోమాపో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక బద్వేల్​ ఉప ఎన్నికకు అక్టోబర్​ 30న పోలింగ్​ జరగగా.. నవంబర్​ 2న ఫలితం తేలనుంది.

badwel by poll
badwel by poll

By

Published : Sep 28, 2021, 4:12 PM IST

Updated : Sep 29, 2021, 5:15 AM IST

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగరా మోగింది. మూడు లోక్‌సభ, ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలు సహా వీటన్నింటికీ అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఉప ఎన్నికకు షెడ్యూల్​ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. వైకాపా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే తెదేపా అభ్యర్థిని ప్రకటించగా.. అధికార పార్టీ అధికారికంగా పేరు వెల్లడించలేదు. అయినప్పటికీ ఇరు పార్టీల నేతలు.. క్యాడర్​కు దిశానిర్దేశం చేస్తూ... క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి:

ఉప ఎన్నికల్లో కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. సమావేశమందిరాల్లో 30 శాతం మందిని, బహిరంగ సభల్లో అయితే మైదానం సామర్థ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. ముఖ్య ప్రచారకర్తల సంఖ్య 20 మందికి మించకూడదు. రోడ్‌ షోలు, కార్లు, మోటారు సైకిళ్లు, సైకిల్‌ ర్యాలీలకు అనుమతిలేదు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు అయిదుగురికి మించకుండా ఇంటింటి ప్రచారం చేసుకోవాలి. ఎన్నికల రోజున అభ్యర్థి రెండు వాహనాలతో ముగ్గురు వ్యక్తులతోనే పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలి.

షెడ్యూల్ ఇలా..

బద్వేల్ ఉప ఎన్నికకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలించనుండగా.. ఉపసంహరణకు అక్టోబర్‌ 13 వరకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 30న ఎన్నికలు నిర్వహించనుంది. నవంబర్ 2న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

వైకాపా అభ్యర్థి ఎవరంటే..!

బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో అక్కడ అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పేరును వైకాపా అధిష్ఠానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.

భారీ మెజార్టీతో గెలుస్తాం: సజ్జల

బద్వేల్ ఉప ఎన్నికకు షెడ్యూల్​ రావటంతో... ప్రభుత్వ సలహాదారుడు, వైకాపా ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ప్రజల అభిమానం, ఆదరణ తమ పార్టీకి ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మేమేం చేసేమో ప్రజల ముందుకు తీసుకెళ్తామన్న ఆయన.. బద్వేలులో మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పారు.

మరోసారి ఆయనకే..

ఈ ఉప ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. గత ఎన్నికల్లో వెంకటసుబ్బయ్యపై పోటీ చేసి ఓటమి పాలైన ఓబులాపురం రాజశేఖర్‌నే మరోసారి బరిలో నిలిపింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముందుగానే అభ్యర్థి ఖరారుకావడంతో..ఆయన ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య నేతలను కలిసి ఎన్నికల్లో మద్దతు కోరుతున్నారు. 2019 ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీకి తెదేపా తరపున పోటీ చేసి.. వెంకటసుబ్బయ్య చేతిలో ఓడిపోయారు.

ఎమ్మెల్యే మృతి.. ఉప ఎన్నిక అనివార్యం

బద్వేల్ శాసనసభ్యుడుగా గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఎంబీబీఎస్ చేస్తుండగా... మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్​గా వెంకటసుబ్బయ్య కొంత కాలం సేవలందించారు. వైకాపా నుంచి 2019లో తొలిసారిగా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయిన కారణంగా.. మంచి సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ వెంకట సుబ్బయ్యకు వైకాపా అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది. రెండేళ్ల నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు.. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి విజ‌యానంద్‌ను కడప జిల్లా కలెక్టర్ కలిశారు. ఉప ఎన్నికపై సమీక్షించారు. ఉపఎన్నిక‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చదవండి

పంజాబ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్- పీసీసీ చీఫ్​ పదవికి సిద్ధూ రాజీనామా

Last Updated : Sep 29, 2021, 5:15 AM IST

ABOUT THE AUTHOR

...view details