ఊరంతటికీ ఒకటే బోరు... కదిలిస్తే ఉబికి వచ్చెను కన్నీరు - కడప జిల్లా
ఆ గ్రామంలో సుమారు 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. తాగునీటి కోసం 2 బోర్లు ఉన్నాయి. కానీ పనిచేయవు. 8 నెలలుగా తాగునీటి కోసం ఆ గ్రామం తల్లడిల్లిపోతోంది. చివరకు గుక్కెడు నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కడప జిల్లా రాజంపేట మండలం కటారుపల్లిలోని దుస్థితి.
కడప జిల్లాలో క'న్నీటి' కష్టాలు
By
Published : Sep 17, 2019, 2:31 PM IST
కడప జిల్లాలో క'న్నీటి' కష్టాలు
కడప జిల్లా రాజపేట మండలం కటారుపల్లిలో తాగునీటికి ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ఎంత మంది అధికారులకు చెప్పినా, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఒక బోరు వద్ద ఆగి ఆగి వచ్చే చుక్క నీటికోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. గ్రామంలోని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చి ఒకరోజు ఒక వర్గం మరో రోజు మరో వర్గం 2 బిందెల చొప్పున పట్టుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. నీటి అవసరం ఎంత ఉన్నా తమ వంతు వచ్చే వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గ్రామంలో ఉండే 2 బోర్లు బాగు చేస్తే తాగునీటికి ఇబ్బంది ఉండదని గ్రామస్థులు చెబుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉంటే కొత్త పైపులు వేయాలని కోరుతున్నారు. గ్రామానికి సమీపంలో పుల్లంపేట మండలానికి తాగునీరు అందించే మంచినీటి పైప్లైన్ వెళ్తోందని, దాని ద్వారా ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని కోరుతున్నారు. కటారుపల్లి తాగునీటి సమస్యను "ఈనాడు- ఈటీవీ భారత్" నీటి పారుదల అధికారి వీరన్న దృష్టికి తీసుకెళ్ళింది. ఈ సమస్యపై ఆయన స్పందిస్తూ ప్రత్యక్షంగా గ్రామానికి వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యను తెలుసుకుంటానని, తక్షణమే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.