ఆధునిక పంట డ్రాగన్ ఫ్రూట్ కడప జిల్లాలో వేగంగా విస్తరిస్తోంది. తైవాన్, వియత్నం దేశాల్లో పండే ఈ పంటను ఇటీవల కాలంలో మన రైతులు సాగు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో 52.5 ఎకరాల్లో ఈ తోటలు విస్తరించాయి. నాటిన 9 నుంచి 12 నెలల లోపు కాపు రావడం, తక్కువ చీడపీడలు తెగుళ్లు, అధిక మార్కెట్ ధర, ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండడం వల్ల పంటకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా వ్యాపారులే తోటల వద్దకు వచ్చి డ్రాగన్ ఫ్రూట్ కొనుగోలు చేస్తుండటంతో ఈ ఆధునిక పంట సాగువైపే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రైతు ప్రసాద్ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. అతనికి అంతకుముందు నిమ్మ తోటలు ఉండేవి. వర్షాభావం, సరైన మార్కెట్ లేకపోవడంతో తరచూ నష్టాలను చవి చూసే వాడు. దీంతో ఉద్యాన శాఖ అధికారుల సలహా మేరకు గత ఏడాది జూలైలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు. గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి సుమారు 4వేల మొక్కలను తెప్పించి నాటాడు. ప్రస్తుతం కాపు రావడంతో ఆ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు..
డ్రాగన్ ఫ్రూట్ తోట వేయాలంటే కచ్చితంగా రాతి దిమ్మెలు అవసరం. ఒక రాతి దిమ్మె చుట్టూ నాలుగు మొక్కలు నాటుతారు. ఒక ఎకరాకు 450 నుంచి 500 వరకు ఈ స్తంభాలు కావాల్సి ఉంటుంది. ఇందులో దాదాపు 1800 నుంచి 2000 మొక్కలు నాటుతారు. ఒక ఎకరాకు సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే మొదటి సంవత్సరంలో ఐదు వందల కిలోల నుంచి ఒక టన్ను, రెండవ సంవత్సరం ఒకటి నుంచి రెండు, మూడో ఏడాది రెండు నుంచి నాలుగు, నాలుగో ఏడాది 4 నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ ధర ఒక కిలోకు 150 రూపాయలు పలుకుతోంది. పింకు రకం ఫ్రూట్ 200 నుంచి 250 రూపాయల వరకు ధర పలుకుతోంది. నీటి అవసరం కూడా ఎక్కువగా ఉండదని, తెగుళ్ళు తక్కువేనని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.