నకిలీ చలానాల కుంభకోణం తొలుత వెలుగుచూసిన కడప జిల్లాలో ముగ్గురు బాధ్యులను పోలీసులు అరెస్టు చేశారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రైటర్స్‌గా పనిచేసిన వ్యక్తులే ప్రభుత్వాదాయానికి గండి కొట్టారని పోలీసులు తేల్చారు. కేవలం 8 నెలల్లోనే కోటి రూపాయలకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని... ప్రతి రూపాయీ ప్రభుత్వానికి తిరిగి చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
గడచిన కొద్దిరోజులుగా రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానాల బాగోతం బయటపడుతోంది. తొలుత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది సీఎం జగన్ సొంత జిల్లాలోనే. ఈ నెల 4న దీనిపై కేసు నమోదైంది. కడప పట్టణ, గ్రామీణ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రైటర్స్‌గా పనిచేస్తున్న వ్యక్తులే నకిలీ చలానాలు సృష్టించి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేస్తున్నారని తేల్చారు. శుక్రవారం ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు జింకా రామకృష్ణ, లక్ష్మీనారాయణ, గురుప్రకాశ్‌లను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.