గత ప్రభుత్వంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని వైకాపా నేత డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. వాటిపై ప్రస్తుత ప్రభుత్వం సీబీఐతో విచారణ చేయించాలని చెప్పారు. కడప ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడిన ఆయన... ఎన్నికల ఫలితాలు చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు నిదర్శనమన్నారు.
గతంలో జగన్ను తాను విమర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. అవేవి మనసులో పెట్టుకోకుండా తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తుచేశారు. అవినీతిలేని పాలన అందించడానికి జగన్ కృషి చేస్తోన్నారని డీఎల్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో ఆర్థిక మంత్రి ఎల్ఓసీ పత్రాలు ఇవ్వడానికి 3 శాతం కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచి ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో...ప్రస్తుత ప్రభుత్వం బయటపెట్టాలని కోరారు.