రాయచోటిలో పర్యటించిన జిల్లా ఎస్పీ - కడప జిల్లా రాయచోటి లో ఎస్పీ పర్యటన
కడప జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. రాయచోటిలో పర్యటించిన ఆయన లాక్డౌన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కడప జిల్లా రాయచోటిలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ పర్యటించారు. పులివెందుల డీఎస్పీ వాసుదేవన్, సీఐ రాజులతో కలిసి నియోజకవర్గంలో కొనసాగుతున్న పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బందోబస్తును పర్యవేక్షించారు. కడప జిల్లాలో వంద శాతం ప్రశాంత వాతావరణం నెలకొందని అన్నారు. అనుమతి లేకుండా రహదారులపైకి ఎవరైనా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలనుంచి జిల్లాలోకి ఎవరూ రాకుండా 14 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. నిత్యావసర సరుకుల కొనుగోలుకు ప్రజలు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. కడప జిల్లాలో ఇప్పటివరకు కరోనా కేసులు ఎక్కడ నమోదు కాలేదని.. తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.