జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కడప జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్.. మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. విజయవాడ నుంచి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ సంబంధిత కార్యదర్శులతో కలిసి.. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ అన్బు రాజన్, జేసీ (రెవెన్యూ) ఎం.గౌతమి, జేసీ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం.. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరికిరణ్ మున్సిపల్ కమీషనర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ సమకూర్చుకోవటం, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు, పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూములో భద్రపరచుకోవటం, కౌంటింగ్ హాల్ ఏర్పాటు.. వంటివన్ని పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని.. అనంతరం కొవిడ్ ప్రభావం కారణంగా వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ.. అప్పట్లో వాయిదా పడిన చోట నుంచి కొనసాగించాలని తెలిపారు.