Sri Bhagavan Mahavir Museum: శ్రీ భగవాన్ మహావీర్ ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి స్థానిక జైనులు విరాళాలిచ్చారు. 1982లో ఈ పురావస్తు ప్రదర్శనశాలను అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఇందులోని నాలుగు గ్యాలరీల్లో చరిత్రకారుల విగ్రహాలు, శాసనాలు, రాజుల కాలం నాటి ఖడ్గాలు, నాణేలు, పంచలోహ విగ్రహాలు, ఆదిమానవులు ఉపయోగించిన రాళ్లు, కర్రలు ఇక్కడ దర్శనమిస్తాయి. మొత్తం 333 విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి.
కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమైన పురాతన వస్తువులను ఈ పురావస్తు ప్రదర్శనశాలలో సందర్శకుల కోసం భద్రపరిచారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణా లోపంతో శిథిలావస్థకు చేరిన ఈ భవనంలో.. విద్యుత్ సౌకర్యం లేకుండానే విధులు నిర్వహిస్తున్నామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మ్యూజియంలో సిబ్బంది కొరత కూడా ఉందన్నారు.
మ్యూజియంను సందర్శించడానికి వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని పురావస్తు ప్రదర్శనశాల సిబ్బంది తెలిపారు. నూతన భవన నిర్మాణ కోసం ప్రభుత్వానికి నాలుగేళ్ల నుంచి ప్రతిపాదనలు పంపుతున్నా.. స్పందన కరవైందంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన భవనం నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.