CBI in the investigation of Viveka murder case: దేశంలో అత్యున్నత నేర పరిశోధన సంస్థ సీబీఐకే రాష్ట్రంలో వైకాపా నేతలు, అధికార యంత్రాంగం చుక్కలు చూపించింది. మరెక్కడా లేని విధంగా సీబీఐ అధికారులు చేదు అనుభవాలు వారు ఎదుర్కొన్నారు. వివేకా హత్యకేసు దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి వైకాపా నేతలు, ఏపీ ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. సీబీఐని అష్టదిగ్బంధం చేశారు. ఈ కేసులో సీబీఐకి ఎవరైనా సాక్షులు వాంగ్మూలం ఇస్తే వారిని బెదిరించారు. సీబీఐ అధికారులు తమను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారంటూ వారితోనే ఎదురు కేసులు పెట్టించారు. బహుశా ఇంతటి దారుణమైన వారు ఇంకెక్కడా ఎదుర్కొని ఉండకపోచ్చు.
ఎఫ్‌ఐఆర్‌పై స్టే: కేసు కీలక దశకు చేరుకున్న తరుణంలో దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రామ్‌సింగ్ తనను బెదిరిస్తున్నారని ఈ కేసులో అనుమానితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా కేసు నమోదు చేశారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో ఆ ఎఫ్‌ఐఆర్‌పై స్టే వచ్చింది.
పులివెందుల సీఐ శంకరయ్య సస్పెండ్: సీబీఐ బృందం వెంటనే కడప నుంచి వెళ్లిపోవాలని... లేకుంటే బాంబు వేసి పేల్చేస్తానంటూ ముసుగు ధరించిన వ్యక్తి సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ షేక్ వలీ బాషాను బెదిరించాడు. అలాగే కోర్టు నుంచి వెళ్లేప్పుడు సీబీఐ అధికారులను అవినాశ్‌రెడ్డి అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. రిమాండ్‌లో ఉన్న శివశంకర్‌రెడ్డిని మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే కడప సెంట్రల్ జైల్ నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా వివేకా హత్య సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సస్పెండ్ కాగా....ఆయన 2021 సెప్టెంబర్ 28 సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఇదే విషయాన్ని మేజిస్ట్రేట్ ఎదుట చెప్పాలంటూ వారు సీబీఐ కోరగా నిరాకరించారు. ఆ తర్వాత వారం రోజులకే సీఐ సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది.