కరోనాపై యుద్ధంలో మనోధైర్యానికి మించిన ఆయుధం లేదని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కడపలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. కొవిడ్-19 నియంత్రణకు నగర పరిధిలో తీసుకుంటున్న చర్యలు, కరోనా ఆసుపత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో కల్పిస్తున్న సదుపాయాలు తదితర విషయాలను ఆర్డీఓ ఉపముఖ్యమంత్రికి వివరించారు.
అంజాద్ బాషా మాట్లాడుతూ.. వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉంటే దాన్ని ఎదుర్కోవచ్చని తెలిపారు. పాజిటివ్ వస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదని.. సరైన మందులు, ఆహారం తీసుకుంటే కరోనాను జయించవచ్చని సూచించారు. అందుకు తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు వైరస్ సోకినా వైద్యుల సూచనలతో దాన్ని జయించి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం అందిస్తున్న భరోసాతో 90 శాతానికి పైగా బాధితులు కోలుకుంటున్నారన్నారు. కొవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.