కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు పనుల్లో జాప్యం జరుగుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపనలు నిర్వహించినా పనులు ముందుకు సాగలేదు. గతేడాది డిసెంబరు 23వ తేదీన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల మధ్యలో 3148.68 ఎకరాల విస్తీర్ణంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో సమీకృత ఉక్కు కర్మాగార నిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆనాడు నిర్వహించిన బహిరంగ సభలో మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం పలు ప్రభుత్వ అనుమతులను కూడా మంజూరు చేశారు. పారిశ్రామిక అవసరాలకు గండికోట జలాశయం నుంచి ఉక్కు కర్మాగారానికి రెండు టీఎంసీల నీటి తరలింపునకు నిర్ణయించారు. ఉక్కు తయారీలో ముడి సరకైన ఇనుము (ఐరన్) సరఫరాకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కర్మాగార ఏర్పాటుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్(ఏపీహెచ్‌ఎస్‌ఎల్) పేరిట ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్లలో ఉక్కు కర్మాగార ఏర్పాటు పనుల కోసం సుమారు రూ.500 కోట్ల నిధులు కేటాయించారు. అయితే నిర్మాణ పనుల్లో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని గమనిస్తే.. 2023 నాటికి కూడా ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించలేకపోవచ్చునని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.
పెట్టుబడి విషయంలో సందిగ్ధం
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించలేకపోయింది. ప్రధానంగా పెట్టుబడి విషయంలో సందిగ్ధం నెలకొనడంతోనే పనుల్లో పురోగతి లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఎవరు ఆర్థికపరంగా బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉక్కు కర్మాగార ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. ఇటీవల దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. ఒకవైపు కేంద్రాన్ని సాయం అర్థిస్తూనే, పెట్టుబడులకు ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే ఏడు ప్రైవేటు సంస్థలు సానుకూలంగా స్పందించాయి. అయితే వీటిలో ఒక సంస్థని భాగస్వామిగా ఎంపిక చేయాల్సి ఉంది.
కనీస వసతులేవీ?