కడప జిల్లాలో రబీ సీజన్లో శనగ పంటను అత్యధికంగా సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లాలో 1.30 లక్షల హెక్టార్లలో పంట సాగైనట్లు లెక్కలున్నాయి.పెద్దముడియం, రాజుపాలెం, జమ్మలమడుగు, ముద్దనూరు, కమలాపురం, వేంపల్లి , ఎర్రగుంట్ల, పులివెందుల, పొద్దుటూరులో వివిధ పంటలు వేస్తారు. శనగ, కంది, మినుము, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో వచ్చిన తుపాను.. రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది.
ఏకధాటిగా 40 గంటల పాటు కురిసిన జడివానతో పంటలన్నీ నీట మునిగాయి. జిల్లావ్యాప్తంగా 1.20 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని అధికారులు లెక్కగట్టారు. పెద్దముడియం మండలంలో సుమారు 9వేల హెక్టార్లలో శనగ సాగులో ఉంది. వరద కారణంగా మొక్కలు నీటిలో ఉండడంతో అవి కుళ్లిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.