ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కడప జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్​ కార్యక్రమం

By

Published : Jan 16, 2021, 6:10 PM IST

కడప జిల్లావ్యాప్తంగా కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి అంజద్​ భాషా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాలలో టీకా వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెల్త్ వర్కర్స్, వైద్యులకు మొదటగా... ఆ తర్వాత పోలీసులు, మున్సిపల్ కార్మికులకు టీకా వేస్తారని చెప్పారు.

covid vaccin
కడప జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్​ కార్యక్రమం ప్రారంభం

కరోనా టీకా కార్యక్రమం కడప జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. టీకా కేంద్రాల్లో వైద్యాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

రాజంపేటలో..

కడప జిల్లా రాజంపేట వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్​రెడ్డి ప్రారంభించారు. 500 మందికి సరిపడా టీకాలు వచ్చాయని రోజుకి 100 మంది చొప్పున ఐదు రోజుల పాటు ఈ టీకాలను వేయనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవ్ కుమార్ రెడ్డి , డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్ శేఖర్ తెలిపారు. సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు నియోజకవర్గంలో..

రైల్వేకోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట మండలంలోని ప్రాథమిక వైద్యశాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో సుమారు 700 టీకాల కరోనా వ్యాక్సినేషన్ టీకాలు ఇస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు.

రిమ్స్​లో..

కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కడప రిమ్స్ ఆస్పత్రిలో కొనసాగుతోంది. సర్వర్ సమస్య వల్ల టీకా వేయించుకునే వాళ్ల జాబితా రాకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది తర్జనభర్జన పడ్డారు. ఉదయం పదకొండున్నర గంటలకు టీకా ప్రారంభం కాగా, కేవలం ముగ్గురికి మాత్రమే టీకా వేశారు.

కమలాపురం నియోజకవర్గంలో..

కమలాపురం నియోజకవర్గంలో చెన్నూరు పీహెచ్​సీలో ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి కరోనా వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ కార్యకర్త కృష్ణవేణికి వ్యాక్సిన్​ వేశారు.

రాయచోటిలో..

రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్​ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్సీ జకీయతో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్యానర్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడాన్ని నిరసిస్తూ భాజపా నాయకులు కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.

మైదుకూరులో..

మైదుకూరు సామాజిక ఆసుపత్రిలో కొవిడ్‌ టీకా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత సామాజిక ఆసుపత్రి వైద్యుడు, వనిపెంట ప్రాథమిక వైద్య అధికారి మల్లేష్‌ టీకా వేయించుకుని గంటపాటు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకపోవడంతో యథావిథిగా వారి విధుల్లో నిమగ్నమయ్యారు.

ప్రొద్దుటూరులో..

ప్రొద్దుటూరులో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. వైద్య సిబ్బంది టీకా వేయించుకున్నారు.

జమ్మలమడుగులో..

జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలో తొలి టీకా వేయించుకున్న వ్యక్తి కావడం చాలా గర్వంగా ఉందని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు .

బద్వేల్​లో..

బద్వేలు పురపాలికలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. కోటవీధికి చెందిన గ్రామ సచివాలయం నర్సు చిన్నమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు.

ఇదీ చదవండి:జిల్లాలో 20 కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు

ABOUT THE AUTHOR

...view details