Crimes and Accidents: కడప రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే పట్టాలు రక్తసిక్తమయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలోనే మూడు వేర్వేరు ప్రాంతాలలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు వారిలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. కడప విజయదుర్గ కాలనీకి చెందిన సాయికుమార్ రెడ్డి హేమమాలినిలకు ఏడాది కిందట వివాహమైంది. సాయికుమార్ వ్యాపారాలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అయితే గత కొంతకాలం నుంచి ఆ భార్యాభర్తలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆ జంట.. మంగళవారం రాత్రి కడప శివారులో కనుమలోపల్లి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం రైల్వే పోలీసులకు సమాచారం అందటంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ దంపతుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతురాలు హేమమాలిని ఎనిమిది నెలల గర్భవతి కూడా. దీంతో ఏడాది గడవకు ముందే ఆ జంట ఆత్మహత్యకు పాల్పడటంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఆ దంపతులు ఆర్థిక సమస్యలతోనే మరణించారా? లేదా మరి ఏ ఇతర కారణాలైనా ఉన్నాయా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్సై రారాజు తెలిపారు.
రైలు పట్టాలపై మృతదేహం.. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఓ మృతదేహం లభ్యమైంది. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. రాజంపేట రైల్వే అధికారులు ఈ ఘటనపై రేణిగుంట రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.