ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హలో..' కడప పీఎఫ్‌ కార్యాలయంలో కరోనా నిబంధనలేవీ..!! - కడపలో కరోనా నిబంధనలు

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ దిశగా ప్రభుత్వాలు, అధికారులు పలు చర్యలు చేపడుతున్నా అక్కడ మాత్రం అవి మచ్చుకైనా కానరావు. పేరుకే ప్రజలకు కార్యాలయంలోకి అనుమతి లేదు. కానీ..ఓ ల్యాండ్ ఫోన్లో మాత్రం అధికారులను సంప్రదించవచ్చు. దానిని వాడిన వారికి కరోనా ఉంటే ఇక అంతే…ఆ ఫోన్ ను శానిటైజ్ చేస్తున్నారో లేదో తెలియదు..పర్యవేక్షణ లేదు..కనీసం చేతులు శుభ్ర పరుచుకోవడానికి శానిటైజర్ కూడా అందుబాటులో లేదు. ఇదీ కడప పీఎఫ్ కార్యాలయ ప్రస్తుత పరిస్థితి..

no corona safety precautions in kadapa pf office
'హలో..' కడప పీఎఫ్‌ కార్యాలయంలో కరోనా నిబంధనలేవీ..!!

By

Published : Oct 30, 2020, 7:35 PM IST

కరోనా వైరస్‌ దృష్ట్యా కడపలోని భవిష్యనిధి కార్యాలయంలోకి(పీఎఫ్‌) ప్రజలెవ్వరినీ అనుమతించడం లేదు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన పీఎఫ్‌ కార్యకలాపాలన్నీ ఇక్కడే జరుగుతాయి. ఆయా జిల్లాల్లో పీఎఫ్‌ కార్యాలయాలు ఉన్నప్పటికీ ప్రజలు పనుల కోసం కడపకే వస్తుంటారు. కార్యాలయానికి వచ్చేవారు కార్యాలయ అధికారితో మాట్లాడాలనుకుంటే ఇక్కడ ఓ ల్యాండ్‌ ఫోన్‌ ఏర్పాటు చేశారు. ఆ ఫోన్‌ నుంచి మాట్లాడితే పీఆర్వో ఫోన్‌ ఎత్తి ఏ పని మీద వచ్చారు, ఏ అధికారిని కలవాలని అడుగుతారు. ఒకవేళ అధికారి లేరంటే వారు వెనుదిరగాల్సిందే. సీమ జిల్లాల నుంచి చాలామంది ప్రతిరోజు వస్తుంటారు. ఇలా వచ్చిన వారందరూ ఫోన్‌ చేస్తారు. వచ్చిన వారిలో ఎవరికి కరోనా వైరస్‌ ఉందో లేదో తెలియదు. ఫోన్‌ ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంది.కనీసం ఫోన్‌ను శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నారో లేదో తెలియదు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు కార్యాలయంలోకి ఎవ్వరిని పంపించడం లేదు. పీఆర్వోను కార్యాలయ ఆవరణలో అందుబాటులో ఉంచితే ప్రజలు వారి సమస్యలను విన్నవించవచ్చు.. సంబంధిత అధికారితో ఫోన్‌లో మాట్లాడడం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుంది.

సమాచారం ఇవ్వడంలేదు

కార్యాలయ ఆవరణలోని భద్రతా సిబ్బందితో పాటు మరో ఇద్దరు ఉంటారు. వారు వచ్చిన వారికి సరైన సమాచారం ఇవ్వడం లేదు. వారికి కొన్ని విషయాలు తెలియవు. దీంతో ప్రజలు సరైన సమాచారం లేక ఇబ్బందులు పడుతున్నారు. అన్నీ ఫోన్‌లో మాట్లాడాలంటే కష్టమవుతోంది. కరోనా దృష్ట్యా అన్ని పనులు ఆన్‌లైన్‌ చేస్తున్నారు. చాలా మందికి ఆన్‌లైన్‌పై అవగాహన లేక పనులు జరగటం లేదు. దీంతో పనులన్నీ నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. బాధితులు కాళ్లరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించాలని కోరుతున్నారు.

సకాలంలో పనులు చేస్తున్నాం

“ల్యాండ్‌ ఫోన్‌ను శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నాం. కరోనా దృష్ట్యా ఎవరినీ లోపలికి రానీయడంలేదు. అత్యవసర పనైతేనే పంపిస్తున్నాం. కార్యాలయంలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో విడతల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అన్ని పనులను సకాలంలో చేస్తున్నాం.”- అవినాష్‌, సహాయ కమిషనర్‌

ఇవీ చదవండి:

అప్పుల ఊబిలో కూరుకుని ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతలు

ABOUT THE AUTHOR

...view details