నాడు ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా రాణిస్తూ మెరుగైన జీవనం సాగించిన వారు.. నేడు కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నారు. బోధన వృత్తితో ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ కొలువులు రాకున్నా తాము చదివిన చదువులకు తగ్గట్టుగా బోధననే జీవనోపాధిగా మలుచుకొన్నారు. నీడనిచ్చిన సరస్వతి నిలయాలకు పేరు తెచ్చారు. జీవితం సజావుగా సాగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలయ్యారు. పాఠశాలలు తెరుచుకోక, కొలువుల్లోకి తీసుకోక వేతనం ఇచ్చే వారు లేక వీరి జీవనం దుర్భరంగా మారింది. ఇంటి అద్దె చెల్లించలేక, ఖర్చులకు తాళలేక కూలీ పనులకు వెళుతున్నారు.
కడప జిల్లాలో సుమారు 4,800 మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు వసూలు కాకపోవడం, వాటి ఆదాయం అంతంత మాత్రంగా ఉండటం తదితర కారణాలతో యాజమాన్యాలు జీతాలు చెల్లించలేక చేతులెత్తేశాయి. పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాతైనా వేతనాలు చెల్లిస్తారన్న నమ్మకం లేదంటున్నారు ఉపాధ్యాయులు. ఫీజులు ముందుగానే వసూలు చేసిన కార్పొరేట్ సంస్థలూ వేతనాలు చెల్లించకపోవటంతో ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి 12 నెలల జీతంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలి. అయినా ఏ ఒక్కరూ తమను పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు.
బోధనేతర సిబ్బంది పరిస్థితి ఇంకా దారుణం
లాక్‌డౌన్.. కరోనా వైరస్ కారణంగా చాలా విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతుండటంతో.. ఈ విద్యా సంస్థల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది క్రమంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. వీటిలో పనిచేసే హాస్టల్ వార్డెన్లు, ఫ్లోర్ ఇంఛార్జీలు, బస్సు డ్రైవర్లు, క్లీనర్లు, వంట మనుషులు ఇలా అనేక విభాగాల్లో పనిచేసే బోధనేతర సిబ్బందిని ఆయా సంస్థలు ఉద్యోగాల నుంచి తొలగించటంతో వారు మానసిక వేదన చెందుతున్నారు.
ప్రభుత్వం ఆదుకుంటే మేలు