ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పసిడిపురి ప్రొద్దుటూరులో.. స్వర్ణకారులను చుట్టుముట్టిన కరోనా చీకట్లు - స్వర్ణకారుల జీవితాల్లో కరోనా నింపిన చీకట్లు !

బంగారం వ్యాపారంలో రెండో ముంబయిగా ఖ్యాతి గడించిన పసిడిపురి ప్రొద్దుటూరు నేడు వ్యాపారాలు లేక వెలవెల బోతోంది. లాక్ డౌన్ కారణంగా కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతిన్నది. కరోనా కాటుతో 5 వేల మంది స్వర్ణకారుల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుతం వ్యాపారాలు తెరుచుకున్నా... బంగారం ధర అమాంతం పెరగడంతో కొనుగోళ్లు లేక స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. చరిత్రలో ఎన్నడూ ఇంతటి దుర్భరస్థితి ఎదురు కాలేదనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్వర్ణకారుల జీవితాల్లో కరోనా నింపిన చీకట్లు !
స్వర్ణకారుల జీవితాల్లో కరోనా నింపిన చీకట్లు !

By

Published : Jun 21, 2020, 10:44 AM IST

కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణం బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి. నాణ్యతలో రాజీ పడకుండా మేలిమి బంగారంతో వినియోగదారులకు చక్కటి ఆభరణాలు తయారు చేయటంలో ప్రొద్దుటూరు ఖ్యాతి గడించింది. రెండో ముంబయిగా పేరుగాంచిన పసిడిపురిలో ఏటా వంద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈ పట్టణంలో 1500 వరకు బంగారు దుకాణాలు ఉన్నాయి. వీటిలో 1200 స్వర్ణకారుల దుకాణాలు కాగా... 300 దుకాణాలు వ్యాపారస్తులవి. దాదాపు 5 వేల మంది స్వర్ణకారులు బంగారు వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు.

సరిగ్గా పెళ్లిళ్ల సీజన్లలోనే లాక్ డౌన్ ప్రారంభం కావడంతో ఆ ప్రభావం బంగారం వ్యాపారంపై పడింది. మూడు నెలలపాటు వ్యాపార దుకాణాలు తెరుచుకోకపోవటంతో స్వర్ణకారులు తీవ్రంగా నష్టపోయారు. చరిత్రలో ఇంతటి దుర్భర పరిస్థితి ఎపుడూ చూడలేదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుకాణాలు తెరుచుకున్నా...

ఈనెల 3 నుంచి బంగారు దుకాణాలు తెరుచుకున్నా ... రాత్రి 7 గంటలకే మూసి వేయాల్సి వస్తోంది. కరోనా కారణంగా వినియోగదారులు ఎవ్వరూ బంగారం కొనడానికి బయటికి రావడం లేదు. దీనికితోడు బంగారం ధర అమాంతం పెరగడం కూడా వ్యాపారాలు దెబ్బతినటానికి కారణమైంది.లాక్ డౌనకి ముందు 10 గ్రాముల బంగారం ధర 42 వేలు ఉండగా.. ప్రస్తుతం 48 వేలకు ఎగబాకింది. దీంతో వినియోగదారులు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. ఫలితంగా దుకాణాలు తెరుచుకున్నా వ్యాపారం జరగడం లేదని వ్యాపారస్తులు మదనపడుతున్నారు.

పని ఎక్కువ.. ఆదాయం తక్కువ

లాక్ డౌన్ సమయంలో బంగారు దుకాణాలు మూత పడటం వల్ల వీటిని నమ్ముకుని జీవిస్తున్న 5 వేల మంది స్వర్ణకారుల పరిస్థితి దయనీయంగా మారింది.ఒక్కో ఆభరణం తయారు చేయాలంటే నాలుగు దశల్లో స్వర్ణకారులు పనిచేయాల్సి ఉంటుంది. ఆభరణాల తయారీలో చేతితో చేసే పని ఎక్కువగా ఉంటుంది. ఒక ఆభరణం తయారు చేస్తే... అందులో గ్రాము బంగారం స్వర్ణకారులకు కూలీ, తరుగు కింద ఇస్తారు. ఒక గ్రాము ధరను నలుగురు స్వర్ణకారులు పంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కో ఆభరణం ఒకరోజుకు తయారవుతుంది. లేదంటే రెండు, మూడు రోజులు పట్టినా ఇచ్చే కూలీ గ్రాము ధర మాత్రమే. ఫలితంగా బంగారు వ్యాపారాన్ని నమ్ముకున్న స్వర్ణకారులు వ్యాపారం లేక కుటుంబాల పోషణ భారంగా మారింది.

పాత ధరతో నష్టాలు

దుకాణాలు తెరిచి 15 రోజులు దాటినా... కొనడానికి ప్రజలు ముందుకు రావటం లేదు. ప్రస్తుతం ఎలాంటి ఆర్డర్లు లేక లాక్​డౌన్​కు ముందు ఇచ్చిన ఆర్డర్ల పనులు చేసుకుంటున్నామని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆభరణాల తయారీ కారణంగా మరికొందరు స్వర్ణకారులు నష్టాలను చవిచూస్తున్నారు. లాక్​డౌన్​కు ముందు బంగారం ధర 42 వేలు ఉండటంతో ఆ లెక్క ప్రకారమే వినియోగదారులు ఆభరణాల కోసం అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు. ప్రస్తుతం బంగారం ధర 48 వేలకు చేరింది. అంటే ధర పెరిగినా ముందున్న ధర ప్రకారమే వినియోగదారులకు ఆభరణాలు తయారు చేయించాల్సి రావడంతో చాలామంది స్వర్ణకారులు నష్టాలను చవిచూస్తున్నారు.

ప్రొద్దుటూరు పట్టణానికి రాయలసీమ నుంచే కాకుండా... చెన్నై, ముంబయి, కోల్​కతా, బెంగుళూరు నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు...లాక్ డౌన్ కారణంగా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో కొత్తకొత్త ఆభరణాలు తయారీకి బ్రేకు పడినట్లైందని వ్యాపారస్తులు అంటున్నారు. స్వర్ణకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం దారి చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details