కడప జిల్లాలో గుర్తింపు పొందిన కళాకారుల సంఘాలు 20 ఉన్నాయి. గుర్తింపు పొందని నాట్యమండళ్లు 40 వరకు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 3 వేల మంది నాట్యమండళ్లను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. మరికొంతమంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఈ రంగంపై మక్కువతో కళలు ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. నాటకాలు ఆగిపోయి కళాకారులకు పని లేకుండా పోయింది. దీంతో వారి బతుకులు ఆర్థికంగా చితికిపోయాయి.
ప్రదర్శనలు లేక.. ఆదాయం రాక
జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, బద్వేలు తదితర ప్రాంతాల్లో కళాకారులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా పౌరాణికం, సాంఘిక నాటకాలు ప్రదర్శించి దాని ద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారు. హార్మోనిస్టులు, తబలా వాయించేవారు. లైట్‌మెన్... తదితర కళాకారులు ఈ రంగంపై ఆధారపడినవారే. వేసవి కాలంలో నాటకాల సీజన్. అయితే అదే సమయంలో కరోనా ప్రబలి కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. అప్పటినుంచి వీరి జీవనం కళతప్పింది. ప్రదర్శనలు లేక, ఆదాయం రాక కష్టాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.