కడప జిల్లా మైదుకూరులో మళ్లీ కరోనా వైరస్ కలకలం రేగింది. మహారాష్ట్రలోని పుణె నుంచి వచ్చిన దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారు నివాసముంటున్న సీతారామాంజనేయపురంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు. సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేశారు.
ఏప్రిల్‌లో పట్టణంలోని సాయినాథపురంలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకింది. చికిత్స అందించటంతో బాధితులు కోలుకున్నారు. అనంతరం అధికారులు కంటైన్మెంట్ జోన్ ఎత్తివేశారు. కరోనా కేసులు లేకపోవటంతో కొద్దిరోజులుగా పట్టణ వాసులు ప్రశాంతంగా ఉన్నారు.
కాగా ఈ నెల 12న మహారాష్ట్రలోని పుణె నుంచి దంపతులు కడప జిల్లాకు చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో అధికారులు వారి నుంచి నమూనాలను సేకరించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావడం వల్ల దంపతులతో పాటు ఆ కుటుంబంలోని మరో ముగ్గురిని కడప ఫాతిమా వైద్య కళాశాలకు తరలించారు.
50 వేలు దాటిన కరోనా పరీక్షలు
మరోవైపు కడప జిల్లాలో కరోనా వైద్య పరీక్షలు 50 వేలు దాటాయి. మంగళవారం వరకు 50,240 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. మంగళవారం జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 15 మంది విదేశాల నుంచి వచ్చిన వారు కాగా... పులివెందుల, మైదుకూరులో రెండు చొప్పున, ఒంటిమిట్ట, యర్రగుంట్లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదు అయ్యాయి.