కడప నడిబొడ్డున పాత మున్సిపల్ కార్యాలయం వద్ద డంపింగ్ యార్డు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలోని 100 వార్డు సచివాలయాలకు.. ఒక్కొక్కటి చొప్పున చెత్త సేకరించే ఆటోలను కేటాయించారు. వాటిలో ప్రస్తుతం 65 మాత్రమే చెత్త సేకరణ చేస్తున్నప్పటికీ.. మున్సిపాలిటీకి చెందిన ఖాళీ స్థలం ఉండటంతో అదంతా ఇక్కడే పారబోస్తున్నారు. ఈ యార్డు పక్కనే ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, చుట్టూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, జనావాసాలు ఉన్నాయి. ప్రజారోగ్యం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున చెత్త నిల్వచేయడం ఏంటని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కడపలో డంపింగ్ యార్డు వివాదం.. ప్రజల ఆగ్రహం
Kadapa dumping yard: కడప నగరం నడిబొడ్డున డంపింగ్ యార్డు ఏర్పాటు చేయటం వివాదస్పదంగా మారింది. చుట్టూ ఆస్పత్రులు, జనావాసాలున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకుకోకుండా చెత్త నిల్వ చేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డును తొలగించాలని హైకోర్టు ఆదేశించినా నగరపాలక సంస్థ అధికారులు లెక్క చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నగరం నడిబొడ్డున ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలంటూ .. పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కొందరు స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పాత మున్సిపల్ కార్యాలయంలో డంపింగ్ యార్డు మూసివేసి... వేరే ప్రాంతానికి తరలించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా డంపింగ్ యార్డు ఇక్కడే కొనసాగిస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. జనావాసాలకు దగ్గరగా డంపింగ్ యార్డు ఉండటంతో అనారోగ్యం పాలవుతారని అఖిలపక్షం నాయకులు ఆందోళనలు చేపట్టారు. ప్రజారోగ్యం దృష్ట్యా కోర్టు ఉత్తర్వులను పాటించి వెంటనే డంపింగ్ యార్డు తొలగించాలని.. లేకుంటే కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేస్తామంటున్నారు.
ఇదీ చదవండి:ఐఎండీ తీపికబురు.. మరో 14రోజుల్లో వర్షాలే వర్షాలు!