కడప జిల్లాలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా క్యాంపు కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కడప నగరంలో ఉన్న అంజాద్ బాషా కార్యాలయం వద్దకు భవన నిర్మాణ కార్మికులు ర్యాలీగా వచ్చి ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కోవిడ్ కారణంగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని నాయకులు ఆక్షేపించారు. భవన నిర్మాణ కార్మికులందరికీ 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండు చేశారు. కార్మికులు క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేయడంతో లోపల ఉన్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా బయటికి వచ్చారు. కార్మికుల సమస్యలను సావధానంగా విన్నారు.