నూతన ఇసుక పాలసీ పేరుతో ప్రభుత్వం దోబూచులాడుతోందంటూ.. కడపలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అందుబాటులో లేక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
రాజంపేటలో దొరికే ఇసుకను కడపకు తరలించి.. తిరిగి రాజంపేటకు సరఫరా చేయడం దారుణమని కార్మికులు వాపోయారు. 10 వేల రూపాయలకు వచ్చే ఇసుక కోసం 21 వేలు వెచ్చించాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. అధిక ధరల కారణంగా.. గృహ యజమానులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదన్నారు. ఫలితంగా.. కార్మికులకు పనుల కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.