ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీజేపీకి రాహుల్ గాంధీ ఫోబియా పట్టుకుంది: తులసిరెడ్డి - Disqualification of Rahul Gandhi

Congress Party Protests: రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ.. కడప జిల్లా వేంపల్లి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా కక్ష రాజకీయాలు మితిమీరిపోతున్నాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు.

Congress Party Protests
కాంగ్రెస్ పార్టీ నిరసనలు

By

Published : Mar 25, 2023, 2:19 PM IST

రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ.. నిరసనలు

Congress Party Protests against Suspension of Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లబ్యాడ్జీలు, నల్ల జెండాలు పట్టుకుని నిరసన దీక్ష చేపట్టారు. నరేంద్ర మోదీ డౌన్ డౌన్.. రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పీసీసీ మీడియా ఛైర్మన్‌ తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలు మితిమీరి పోతున్నాయని అన్నారు.

నెల రోజుల్లో పైకోర్టుకు అపీల్ చేసుకోవచ్చని కోర్టు తీర్పులోనే అవకాశం ఇచ్చిందన్నారు. కానీ 24 గంటలు కాకుండానే రాహుల్ గాంధీ లోక్​సభ సభ్యతాన్ని రద్దు చేస్తూ.. సర్క్యులర్​ పంపడం దారుణం అని మండిపడ్డారు అన్నారు. ఇది పూర్తిగా బీజేపీ కక్ష సాధింపు చర్య అని తులసి రెడ్డి మండిపడ్డారు. బీజేపీకి రాహుల్ గాంధీ అంటే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని భావించే.. రాహుల్​పై వేటు వేశారని అన్నారు.

బ్రిటిష్ సామ్రాజ్య నేతలనే తరిమి కొట్టిన పార్టీ.. కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. గాంధేయ పద్ధతిలో.. ప్రజాస్వామ్యం పద్ధతిలో న్యాయ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ పోరాటంలో అంతిమ విజయం కాంగ్రెస్​దేనని అన్నారు. బీజేపీకి ఓటమి తప్పదని పీసీసీ మీడియా ఛైర్మన్‌ తులసి రెడ్డి పేర్కొన్నారు.

"భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. దీనికి పరాకాష్టనే రాహుల్ గాంధీ లోక్​సభ సభ్యత్వం రద్దు చేయడం. దానికి కారణం ఏమిటీ.. దొంగలందరికీ మోదీ పేర్లు ఉన్నాయి అన్నారు. మోదీ పేర్లు ఉన్న వాళ్లంతా దొంగలు అని చెప్పలేదు. దీని ప్రకారం అయితే.. దేశంలో ఏ రాజకీయ నాయకుడు బయట ఉండకూడదు. అందరూ జైల్లో ఉండాల్సిందే. ఇలాంటి వ్యాఖ్యలు రోజుకు కొన్ని వందలు వింటూ ఉంటాం. సాక్ష్యాత్తూ నరేంద్ర మోదీనే.. పార్లమెంటులో రేణుకా చౌదరిని ఉద్దేశించి శూర్పణఖ అన్నారు. అదే విధంగా నెహ్రూ ఫ్యామిలీ గురించి చాలా సార్లు మాట్లాడారు.

రాహుల్ పార్లమెంటులో అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో మోదీ, అమిత్​షా ఉన్నారు. రాహుల్ ఫోబియా అనేది బీజేపీ నాయకులను వెంటాడుతోంది. రాహుల్ గాంధీ పార్లమెంటులో ఉంటే వచ్చే ఎన్నిక్లలో ప్రధాని కావడం తథ్యం అని భయంతో.. ఈ కుట్ర చేశారు. ఇటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ బయపడరు. ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం కాంగ్రెస్​దే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పతనం తప్పదు". - తులసి రెడ్డి, కాంగ్రెస్ నేత

రాహుల్ గాంధీకు మద్దతుగా ర్యాలీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ అభిమానులు స్థానిక టీ కూడలి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేయగా అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్లపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details